KTR | హైదరాబాద్ : పిచ్చి కుక్కలు మొరుగుతూనే ఉంటాయి.. వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని మల్కాజ్గిరి కాంగ్రెస్ నేతలను ఉద్దేశించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటుగా వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ గూండాల దాడిలో గాయపడిన గౌతమ్ నగర్ కార్పొరేటర్ సునీత భర్త రాము యాదవ్‌ని కేటీఆర్ పరామర్శించారు. ఈ సందర్భంగా మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డితో కలిసి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.
బీఆర్ఎస్ పాలనలో పదేండ్లలో ఏ ఒక్కరోజు కూడా శాంతి భద్రతల సమస్య రాలేదు. ఒక్కనాడు కూడా కర్ఫ్యూ విధించలేదు. రౌడీ షీటర్ల దురాగతాలు లేవు. ప్రశాంతమైన వాతావరణంలో హైదరాబాద్ నగరం కేసీఆర్ నాయకత్వంలో అభివృద్ధి బాటలో దేశానికి ఆదర్శంగా నిలబడింది. అభివృద్ధిని, శాంతి భద్రత పరిరక్షణను హర్షించిన ప్రజలు, 2018, 2023 ఎన్నికల్లో ఏకపక్షమైన విజయాన్ని కేసీఆర్‌కు అందించారు. అలాగే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 99 సీట్లు సాధించి రికార్డు నమోదు చేశాం. రెండోసారి కూడా గులాబీ జెండా ఎగురవేశాం. హైదరాబాద్‌లో ఒక్క సీటు రాలేదని కోపంతో ఈ ప్రజల మీద పగబట్టి.. ఇక్కడ ఉండే నాయకులను రెచ్చగొట్టి, శాంతి భద్రత సమస్యల సృష్టించి గెలవాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తున్నదని కేటీఆర్ మండిపడ్డారు.
హైదరాబాద్‌లో పిచ్చి కుక్కలు పెరిగాయంటే నేను నమ్మలేదు. కానీ ముఖ్యంగా మల్కాజ్‌గిరిలో బాగా పెరిగాయి. మెడ మీద తలకాయ ఉన్నోడు మల్కాజ్గిరి చౌరస్తాలో గూండగాళ్లను వేసుకువచ్చి గంటసేపు ట్రాఫిక్ జామ్ చేస్తే బస్తీ మే సవాల్ అని చిల్లర రాజకీయాలు చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారు. మా ఎమ్మెల్యేలను, నాయకులను అరెస్టు చేయడం కాదు. గుండాలను నియంత్రించేందుకు ఏం చేస్తున్నారు. మల్కాజ్‌గిరిలో పెత్తనం చేసేందుకు ఏం అధికారం ఉంది కాంగ్రెస్ పార్టీ నాయకులకు. మా ఎమ్మెల్యే, కార్పొరేట్లు ఉన్నారు. వారంతా ఆలయాలకు చెక్కులిచ్చే ప్రోగ్రామ్‌కు వెళ్తే.. గూండాలతో దాడి చేయిస్తారా..? ఒక్కటి గుర్తు పెట్టుకోండి.. అధికారం ఎవడబ్బ సొత్తు కాదు.. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. మళ్లీ మా టైమ్ వస్తుంది. కట్టుబానిసల్లా పని చేసే అధికారులకు ఒక్కొక్కరిని ఏం చేయాలో రాసిపెట్టుకుంటున్నాం.. చేసి చూపిస్తాం అని కేటీఆర్ స్పష్టం చేశారు.
రాము యాదవ్ మీద ఏడు ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. కార్పొరేటర్ మీద దాడి చేసి గాయపరిచారు. దమ్ముంటే మా కంటే ఎక్కువ హైదరాబాద్ అభివృద్ధి చేయండి. బస్తీ మే సవాల్ అని చిల్లర రాజకీయం చేస్తే మల్కాజ్గిరి ప్రజలు హర్షించరు. విద్యాధికులు, మిలటరీల్లో పని చేసేందుకు వచ్చి స్థిరపడ్డవారు ఉన్నారు. ఇలాంటి ప్రాంతంలో గుండాగిరిని సహించరు. హరీశ్‌రావు క్యాంపు కార్యాలయం మీద దాడి చేసి పెట్రోల్ పోసి తగులబెడుతాం అంటే పోలీసులు కేసులు పెట్టలేని పరిస్థితి. శశిధర్ గౌడ్ రీ ట్వీట్ చేస్తే కేసు పెట్టారు. పెట్రోల్ పోసి తగలబెడుతా అంటే కేసులు పెట్టరు. కానీ రీట్వీట్ చేస్తే కేసు పెడుతారు. పిరికిపందల్లా పోలీసులు వ్యవహరిస్తున్నారు. ఏకపక్షంగా పని చేస్తున్నారు అని కేటీఆర్ ధ్వజమెత్తారు.
మల్కాజ్గిరి నేతలకు పార్టీ అండగా ఉంటుంది. ఏ ఒక్కరి మీద చేయి పడినా మేం అందరం వస్తాం. ఆ తర్వాత జరిగే పరిణామాలకు డీజీపీ, హోంమంత్రిగా ఉన్న సీఎం బాధ్యత వహించాలి. చిల్లర రాజకీయాలు వద్దు.. అభివృద్ధి చేయండి. భయపెడుతాం.. బెదిరిస్తాం అనుకుంటే.. రేవంత్ రెడ్డి అయినా, వాని తొత్తులైనా సరే ప్రతిఫలం అనుభవిస్తారు. మల్కాజ్గిరి ఎమ్మెల్యే అభివృద్ధి చేస్తుంటే మీ కళ్లు మండుతున్నాయి. దాడుల విషయంలో తప్పకుండా డీజీపీని కలుస్తాం. శాసనసభలో కడిగి పారేస్తాం. పోలీసులు మరిచిపోవద్దు.. రీ ట్వీట్లకు కేసులు పెడుతున్నారు. మేం అధికారంలోకి వచ్చాక మీకు ఇదే గతి ఉంటుంది కాంగ్రెస్ నాయకుల్లారా. మన పని మనం చేసుకుంటూ పోదాం.. పిచ్చి కుక్కలు మొరుగుతూనే ఉంటాయి.. వాళ్లను పట్టించుకోవాల్సిన ఖర్మ మనకు లేదు. పిచ్చి కుక్కలకు భయపడొద్దు. పార్టీ అండగా ఉంటుంది. ఎవరూ అధైర్య పడొద్దు. ఈ ప్రభుత్వం మీద యధావిధిగా పోరాటం కొనసాగించాలి అని కేటీఆర్ పిలుపునిచ్చారు.