శేరిలింగంపల్లి, నవంబర్ 24: ఐసీయూ పరిస్థ్ధితుల నుంచి చిన్నారులను ఆరోగ్యవంతులుగా మెరుగైన వైద్యసేవలు అందించి పునర్జన్మను ప్రసాదించి వారియర్స్‌గా తీర్చిదిద్దుతున్న వైద్యులు సేవలు మరిచిపోలేనివని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఆదివారం రాత్రి గచ్చిబౌలిలోని సంధ్య కన్వెన్షన్ హాల్లో లిటిల్వన్స్ క్యూర్ ఫౌండేషన్ అధ్వర్యంలో కిమ్స్ కడల్స్, కిమ్స్ గ్రూప్ ఆఫ్ హాస్పటల్స్ సంయుక్తంగా నిర్వహించిన ‘పీడియాట్రిక్ వారియర్స్ డే’ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ పిల్లలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నప్పుడు తల్లిదండ్రులు ఎంత క్షోభ అనుభవిస్తారో ఓ తండ్రిగా తనకు తెలుసన్నారు. అలాంటి ఆపద పరిస్థితుల నుంచి అనారోగ్య సమస్యల నుంచి విజయవంతంగా వైద్యసేవలందించి పిల్లలను తిరిగి ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దడంలో వైద్యుల సేవలు అభినందనీయమని పేర్కొన్నారు.
కిమ్స్ వైద్యశాల సీఎండీ బొల్లినేని భాస్కరరావు మాట్లాడుతూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాలకు చెందిన దాదాపు 700 మంది చిన్నారులను పీడియాట్రిక్ వారియర్స్‌గా లిటిల్వన్స్ ఫౌండేషన్ అధ్వర్యంలో కిమ్స్ వైద్యులు తీర్చిదిద్దారన్నారు.లిటిల్వన్స్ క్యూర్ ఫౌండేషన్ ట్రస్టీలు విద్యాభూషణ్, రాజేశ్వరరావు, కిమ్స్ హాస్పటల్ ప్రముఖులు బొల్లినేని అభినయ్, అధ్విక్, లక్ష్మారెడ్డి, పీడియాట్రిక్ వైద్య ప్రముఖులు డాక్టర్ అపర్ణ, డాక్టర్ ఫరాక్ పాల్గొన్నారు.