సిటీబ్యూరో/బంజారాహిల్స్, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్‌కు ఓటేయకపోతే సంక్షేమ పథకాలు రద్దు చేస్తామంటూ ధమ్కీ ఇస్తున్న సీఎం రేవంత్‌రెడ్డికి జూబ్లీహిల్స్ ప్రజలు ఓటుతో బుద్ధిచెప్పాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా శనివారం రహమత్‌నగర్ డివిజన్లో రోడ్‌షోలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. పదేళ్లలో ఎన్నో ఎన్నికలు చూశామని, ఎప్పుడూ తాము ఓడిపోతే ప్రభుత్వ పథకాలు రద్దు చేస్తామనలేదని, కానీ రెండేళ్లకే ఈ ప్రభుత్వం పథకాలు రద్దు చేస్తామంటూ బెదిరిస్తున్నదని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
ఒక్క ఆడబిడ్డను ఓడగొట్టడం కోసం ముఖ్యమంత్రి కాలికి బలపం కట్టుకొని తిరుగుతుంటే 14మంది మంత్రులు గల్లీగల్లీ తిరుగుతున్నారని విమర్శించారు. తన భర్త చనిపోయి ఆరు నెలలు కూడా కాలేదని, కానీ తన భర్తను గుర్తు తెచ్చుకొని ఆయన ప్రేమించిన జూబ్లీహిల్స్ ప్రజలను చూసి ఒక్కసారిగా ఏడ్చిన సునీతమ్మ ఏడుపును కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు రాజకీయం చేశారని, ఇంతటి అరాచక పార్టీ గురించి ఆడబిడ్డలు ఒకసారి ఆలోచించాలని కేటీఆర్ అక్కడున్న మహిళలను కోరారు. రేవంత్ సర్కార్ వైఫల్యాలను ఎండగట్టిన కేటీఆర్.. ప్లకార్డులు ప్రదర్శించిన మహిళలు, యువతులను మెచ్చుకున్నారు.

జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతాగోపీనాథ్కు మద్దతుగా కేటీఆర్ నిర్వహించిన రోడ్‌షో సూపర్ సక్సెక్ అయ్యింది. శనివారం రెహమత్నగర్ డివిజన్ ప్రతిభానగర్ నుంచి శ్రీరామ్‌నగర్ వరకు యాత్ర సాగగా జనం నుంచి విశేష స్పందన వచ్చింది. అడుగడుగునా కేటీఆర్‌ను స్వాగతిస్తూ జనం బ్రహ్మరథం పట్టారు. దీంతో ఎస్డీ పాయింట్ హోటల్ వరకు సుమారు కిలోమీటర్ మేర రోడ్డంతా జనం కేరింతలు.. కళాకారుల ఆటాపాటలతో కోలాహలంగా మారింది. ఈ యాత్రలో కాంగ్రెస్ వైఫల్యాలపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు సభికుల నుంచి బ్రహ్మాండమైన మద్దతు లభించింది.

కేటీఆర్ ప్రసంగానికి జనం నుంచి అనూహ్య స్పందన వచ్చింది. ఆయన కాంగ్రెస్ సర్కారు తీరును ఎండగడుతూ చెబుతున్న ప్రతి మాటకూ ప్రతిస్పందనగా చప్పట్లు కొడుతూ హుషారెత్తించారు. కేసీఆర్ పాలనలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో చేసిన అభివృద్ధిని వివరించడంతో పాటు ప్రస్తుత కాంగ్రెస్ వైఫల్యాలను ఎత్తిచూపుతున్న తీరుకు సభికులు మద్దతు తెలిపారు. ఎస్పీఆర్ హిల్స్ వాటర్ రిజర్వాయర్, కార్మికనగర్ ప్రధాన రహదారి విస్తరణ కేసీఆర్ హయాంలోనే జరిగాయా? అంటూ ప్రశ్నించగా అందరూ అవును అంటూ స్పందించారు. నియోజకవర్గ ప్రజల్లో ఎవరికి కష్టం వచ్చినా వెంటనే నేనున్నా ఆంటూ వచ్చి సహకరించిన గోపన్న సతీమణి సునీతకు ఓటేయాలంటూనే నిరంతరం ప్రజల్లో ఉన్న గోపన్న కుటుంబానికి మద్దతు ఇస్తారా? అంటూ అడిగినప్పుడు మాగంటికి అనుకూలంగా నినాదాలు చేశారు. రోడ్‌షో సక్సెస్‌తో బీఆర్ఎస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనిపించింది.

రోడ్ షో సందర్భంగా ఏర్పాటుచేసిన ధూంధాం విశేషంగా ఆకట్టుకున్నది. ముఖ్యంగా ‘జూబ్లీహిల్స్ గడ్డ.. ఇది గులాబీల అడ్డా’ పాటకు జనం ఉత్సాహంగా స్టెప్పులేశారు. ఈ యాత్రలో కొందరు మహిళలు ‘కాంగ్రెస్ సర్కార్ గద్దెనెక్కగానే తమకిస్తానన్న రూ.2500 ఏవీ? రూ.500కే ఫ్రీ గ్యాస్ ఏమైంది? స్కూటీలు ఏమయ్యాయి? అనే నినాదాలున్న ప్లకార్డులు ప్రదర్శించారు. రోడ్‌షో జరుగుతున్న సమయంలో కేటీఆర్ అభివాదానికి ప్రతిగా మహిళలు, పిల్లలు అభివాదాలు చేయగా కొందరు యువత బిల్డింగులపై నుంచి సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు. ఈ రోడ్‌షోకు ఎస్పీఆర్ హిల్స్‌లోని 20కి పైగా బస్తీల నుంచి జనం తరలివచ్చారు. కార్మికనగర్, శ్రీరామ్‌నగర్ తదితర ప్రాంతాల నుంచి మైనార్టీలు రోడ్‌షోకు వచ్చి తమ మద్దతు ప్రకటించారు. సాయంత్రం ఆరు గంటలకు రోడ్‌షో అయినప్పటికీ సాయంత్రం నాలుగు గంటలకే జనం ఉత్సాహంగా చేరుకోవడం విశేషం.