సిటీబ్యూరో, జూన్ 14 (నమస్తే తెలంగాణ )/ఖైరతాబాద్ : రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్‌రెడ్డి పాలన పూర్తిగా అట్టర్ ఫ్లాప్.. డిజాస్టర్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వ గడువులో ఇప్పటికే 50 శాతం సమయం( ఇంటర్వెల్) అయిపోయిందని, ఇక ప్రజలు శుభం కార్డు వేసి ఇంటికి సాగనంపడమే తరువాయి.. అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. తెలంగాణ భవన్లో ఆదివారం జరిగిన ఖైరతాబాద్ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొని ఎస్ఐఆర్, పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఖైరతాబాద్‌లో రెండు సార్లు గులాబీ జెండా ఎగురవేశామని, మూడోసారి కూడా సిద్ధం కావాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. దానం నాగేందర్ నియోజకవర్గ ప్రజలను మోసం చేసి.. రేవంత్‌రెడ్డి పక్కన కూర్చున్నారని మండిపడ్డారు. దానం నాగేందర్‌ను చూసి ఓటు వేయలేదని, కేసీఆర్‌ని చూసి ఓటేశారన్నారు. 2018, 2023లో గెలిచినట్టు..మళ్లీ 2028లో కూడా గులాబీ జెండా ఎగరేద్దామని కేటీఆర్ పిలుపునిచ్చారు.
నగరానికి చేసేందేమీ లేదు..
రెండున్నరేండ్ల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ నగరానికి చేసేందేమీ లేదని కేటీఆర్ విమర్శించారు. ‘హైదరాబాద్‌లో వీళ్లు ఒక్క ఇటుక పెట్టలేదు…కొత్తగా ఒక్క ఇల్లు కట్టలేదు..కానీ హైడ్రా పేరుతో వేలాది మంది గరీబోళ్ల ఇండ్లను నిర్ధాక్షిణ్యంగా కూలగొట్టారు..’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీకెండ్ వచ్చిందంటే చాలు..పేద ప్రజల కొంపల మీద పడి జనం గుండెల్లో భయం పుట్టిస్తూ రేవంత్‌రెడ్డి అత్యంత దరిద్రపు పేరు సంపాదించుకున్నాడని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వమా లేక పేదలను వేధించే ప్రభుత్వమా చెప్పడానికి ఈ కూల్చివేతలే నిదర్శమని కేటీఆర్ అన్నారు.

పేదల పక్షపాతి కేసీఆర్
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పేదలకు జరిగిన మేలును కేటీఆర్ గుర్తు చేశారు. గరీబోళ్లు తెలిసో తెలియకో ఇళ్లు కట్టుకుంటే, నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ మానవత్వంతో ఆలోచించి జీవో నంబరు 58, 59 కింద దాదాపు 2.50 లక్షల మంది పేదల ఇండ్లకు యాజమాన్య హక్కుల పట్టాలు ఇచ్చి మహానాయకుడిగా నిలిచారని కేటీఆర్ స్పష్టం చేశారు. హైదరాబాద్ నగరంలో పేదల ఆత్మగౌరవం కోసం లక్షకు పైగా డబుల్ బెడ్రూం ఇళ్లును అద్భుతంగా నిర్మించి ఇచ్చామని, బీఆర్ఎస్ హయాంలో ప్రతి నియోజకవర్గానికి 3వేల చొప్పున ఇళ్లు కేటాయిస్తే నేటి కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం వెయ్యి ఇళ్లతో సరిపెడుతూ.. పేదలను వంచిస్తోందని కేటీఆర్ ధ్వజమెత్తారు.
ఈ సమావేశంలో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు తలసాని సాయి కిరణ్ యాదవ్, విప్లవ్ కుమార్, మన్నె గోవర్ధన్‌రెడ్డి, జూబ్లీహిల్స్, సోమాజిగూడ మాజీ కార్పొరేటర్లు వెల్దండ వెంకటేశ్, మహేశ్ యాదవ్, హేమలతా యాదవ్, ఖైరతాబాద్ బూత్ లెవల్ ఇన్చార్జి, హైదరాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్పర్సన్ కె. ప్రసన్న రామ్మూర్తి, ఖైరతాబాద్, బంజారాహిల్స్, సోమాజిగూడ, జూబ్లీహిల్స్ డివిజన్ల నాయకులు జేజోళ్ల రాజు, గజ్జెల ఆనంద్, హరీశ్, బస్వగౌడ్, రమేశ్ కురుమ, చంద్రశేఖర్, జ్యోతి, మధుకర్ యాదవ్, నిషాంత్ ముదిరాజ్, బాబు యాదవ్, శ్రీకాంత్ యాదవ్ పాల్గొన్నారు.
చరిత్ర కలిగిన ఉద్యమ పార్టీ
ఎంతో చరిత్ర కలిగిన ఉద్యమ పార్టీ బీఆర్ఎస్. 2001లో కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా పార్టీ ఏర్పాటైంది. దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన పార్టీలకు, బీఆర్ఎస్కు వ్యత్యాసం ఉంది. నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన అన్యాయాలపై పోరాటం జరిపిన పార్టీ బీఆర్ఎస్. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైనా తర్వాత దేశ చిత్రపటంలో తెలంగాణను ప్రత్యేకతను తీసుకువచ్చిన నేత కేసీఆర్. పదేండ్ల పాలనలో దేశంలోనే రాష్ర్టాన్ని మొదటి స్థానంలో నిలిపిన చరిత్ర బీఆర్ఎస్ సర్కార్‌దే. ఖైరతాబాద్ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి అంతా కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే జరిగింది. గులాబీ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు పనిచేయాలి. ఉన్న సిటీలో నీళ్లవ్వలేని కాంగ్రెస్ ప్రభుత్వం.. ఫ్యూచర్ సిటీ నిర్మిస్తామంటున్నది. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థ పాలనను ప్రజల్లో ఎండగట్టాలి.
– మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
గులాబీదే విజయం
ఎన్నికలు ఏదైనా..గులాబీ జెండాదే విజయం కావాలి.. ఖైరతాబాద్ ఎప్పటికీ బీఆర్ఎస్దే. కష్టపడి పనిచేసి విజయం సాధించాలి. బీఆర్ఎస్కు ఇది పరీక్షా సమయం. ప్రతి కార్యకర్త బూత్ ఎమ్మెల్యేగా మారి పార్టీని గెలిపించాలి. ప్రతి ఒక్క కార్యకర్తను పార్టీ గుండెల్లో పెట్టుకొని చూసుకుంటుంది. ప్రపంచ చరిత్రలోనే అత్యంత గొప్ప ప్రజాస్వామిక ఉద్యమాన్ని నడిపిన చరిత్ర కేవలం బీఆర్ఎస్ పార్టీదే. ఏ కార్యకర్త అభద్రతాభావానికి లోనుకావద్దు. ప్రతి ఒక్కరికీ అండగా ఉంటాం. రాజకీయ చరిత్రను పరిశీలిస్తే..ఇంత పెద్ద ప్రజాస్వామిక ఉద్యమాన్ని శాంతియుతంగా నడిపి, విజయపథంలో నిలిపిన మహానాయకుడు కేసీఆర్. కేసీఆర్ పదేండ్ల పాటు రాష్ర్టాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ.. దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దారు. ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధితో పనిచేసి ఖైరతాబాద్ నియోజకవర్గంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పార్టీని విజయతీరాలకు చేర్చాలి.
– ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్