మణికొండ, నవంబర్ 8: ‘నేనూ పెట్ లవర్ని.. కుక్కలు అంటే చాలా ఇష్టం..మా ఇంట్లో పెంపుడు జంతువులు ఉన్నాయని’ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. నార్సింగిలోని ఓం కన్వెన్షన్‌లో రెండురోజుల ‘హై క్యాన్-25’ ప్రదర్శన పెట్ షోను నిర్వహించగా కేటీఆర్ ప్రదర్శనను ప్రారంభించి తన పెంపుడు కుక్క చెర్రీతో కలిసి షోను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన కొడుకు (హిమాన్షు)కు ఏడుకు పైగా వేర్వేరు జాతుల కుక్కలు ఉన్నాయని తెలిపారు. కుక్కలు తమ పిల్లలు లాంటివి..వాటిని చాలా ఇష్టపడతాను..నా చెర్రీతో ఆడటం నాకు స్ట్రెస్ బస్టర్ లాంటిదన్నారు. ఎంత బిజీగా ఉన్నా తను ప్రతి రోజూ కొంత సమయం చెర్రీతో గడుపుతానని పేర్కొన్నారు.
జూబ్లీహిల్స్ ఎన్నిక బిజీ షెడ్యూల్లో కూడా ప్రత్యేకంగా పెట్ షోకు హాజరై గంటకు పైగా గడపడంతో నిర్వాహకులు సంతోషం వ్యక్తం చేస్తూ ఆయనతో సెల్ఫీలు దిగారు. హైదరాబాద్ కెనైన్ క్లబ్ కమిటీ సభ్యుడు రోహిత్ మాట్లాడుతూ కేటీఆర్ గొప్ప పెట్ లవర్ అన్నారు. దేశంలోనే మొదటి డాగ్ పార్క్ హైదరాబాద్‌లో ఏర్పాటు చేయడానికి కేటీఆరే కారణమన్నారు. ఈ ప్రదర్శనలో కుక్కలు, పిల్లులు, ఆక్వాజోన్‌లో జలచర ప్రదర్శనలు, పెట్ వ్యాపారాలకు అవకాశాలు నిర్వహించారు. వివిధ జాతుల 500 కుక్కలు,100 పిల్లులు, వంద రకాల చేపల ప్రదర్శన చేపట్టారు. ఈ కార్యక్రమం ద్వారా దేశంలోని పోలీస్, భద్రతా దళాల్లో సేవలందిస్తున్న కుక్కల ధైర్యాన్ని గుర్తించి సత్కరించారు. కేంద్ర, రాష్ట్ర పోలీస్ కే 9 యూనిట్లు పాల్గొన్నాయి. ఉత్తమంగా ఎంపికైన 2-3 కుక్కలకు అవార్డులను అందజేశారు. ఆల్-బ్రీడ్ చాంపియన్‌షిప్ డాగ్ షోలు, క్యాట్ చాంపియన్‌షిప్, ఆక్వాటిక్ డిస్పే, ఇంటర్నేషనల్ డాగ్ గ్రూమింగ్ పోటీలు, గ్రూమింగ్ సెమినార్లు, క్యాట్ గ్రూమింగ్ వర్క్‌షాపులు కూడా నిర్వహించారు.
కేటీఆర్ రోడ్‌షో సైడ్‌లైట్స్
రేవంత్‌రెడ్డికి జ్ఞానోదయం కలిగిస్తాం !
సిటీ బ్యూరో, నవంబర్ 8 (నమస్తే తెలంగాణ): జూబ్లీహిల్స్ గడ్డమీద మరోసారి గులాబీ జెండా ఎగరేసి రేవంత్‌రెడ్డికి జ్ఞానోదయం కలిగిస్తాం. కేసీఆర్ పాలనలో పదేండ్ల పాటు జూబ్లీహిల్స్ నియోజకవర్గం అభివృద్ధిలో దూసుకుపోయింది. దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పేద ప్రజల నుంచి చిరు వ్యాపారుల దాకా అందరికీ అండగా నిలబడ్డారు. ఎవరికీ ఎన్నడూ ఇబ్బందులు కలుగకుండా పాలన సాగించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కూలీలకు పని దొరకడం లేదు.
బోరబండ, ఎర్రగడ్డ, మోతీనగర్, తదితర ప్రాంతాల్లోనే లేబర్ అడ్డాల్లో కూలీలు పడిగాపులు కాస్తున్నారు. చిరు వ్యాపారులకు గిరాకీలు తగ్గిపోయాయి. బీఆర్ఎస్ హయాంలో వ్యాపారాలు లాభసాటిగా సాగితే.. రెండేండ్ల కాంగ్రెస్ పాలనలో పూర్తిగా నష్టాలు చవిచూస్తున్నారు. రియల్ ఎస్టేట్ సమూలంగా పడిపోయింది. రియల్టర్లు ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి ఏర్పడింది. మరోవైపు నిర్వహణ సరిగ్గా లేక అన్ని వీధుల్లో చెత్త పేరుకుపోతున్నది. ట్రాఫిక్ అస్తవ్యస్తంగా మారిపోతున్నది. మరోసారి మాగంటి కుటుంబాన్ని గెలిపిస్తేనే జూబ్లీహిల్స్ ప్రజలకు అన్ని విధాల న్యాయం జరుగుతుంది. ఆగిపోయిన అభివృద్ధి కొనసాగుతుంది.
-దూబని వెంకన్న, చికెన్ షాప్ యజమాని, మోతీనగర్