KTR | సిటీబ్యూరో, మార్చి 3 (నమస్తే తెలంగాణ): రాజేంద్రనగర్‌లోని మిలీనియం స్కూల్‌కు చెందిన కొందరు విద్యార్థులు తమ స్కూల్ వార్షికోత్సవానికి హాజరుకావాలని ఓ చిన్న వీడియో రూపొందించి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు సామాజిక మాధ్యమం ఎక్స్(ట్విట్టర్) ద్వారా విజ్ఞప్తి చేశారు. ఆ పోస్ట్‌కి స్పందించిన కేటీఆర్.. ‘నాకు షెడ్యూల్లో ఇతర కార్యక్రమాలు ఉన్నా..మీ కోసం.. కొంత సమయాన్ని తీసుకొని.. వస్తా.. మీ ఆహ్వానం అంత బాగా నచ్చింది’ అంటూ సమాధానమిచ్చారు.
ఇప్పటి వరకు తనకు అనేక కార్యక్రమాలకు హాజరు కావాలని ఆహ్వానాలు అందాయని, కానీ ఇంత అద్భుతంగా (క్యూట్‌గా) ఆహ్వానం అందడం ఇదేనంటూ.. కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. ఇచ్చిన మాట ప్రకారం మిలీనియం స్కూల్ వార్షికోత్సవానికి హాజరయ్యారు. తనకు ప్రత్యేకంగా ఆహ్వానం పంపిన చిన్నారులతో కాసేపు ముచ్చటించారు. ఆ తర్వాత స్కూల్ వార్షికోత్సవ కార్యక్రమంలో మాట్లాడి వెనుతిరిగారు. విద్యార్థుల కోరికను మన్నించి కార్యక్రమానికి హాజరు కావడంపై స్కూల్ యాజమాన్యంతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు ధన్యవాదాలు తెలిపారు. కేటీఆర్‌తో సెల్ఫీలు తీసుకొని తమ సంతోషాన్ని పంచుకున్నారు.