మేడ్చల్, ఏప్రిల్13(నమస్తే తెలంగాణ): భవిష్యత్‌లో ఏ ఎన్నికలు వచ్చినా.. కాంగ్రెస్, బీజేపీలకు కర్రుకాల్చి వాత పెట్టాల్సిందేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా మల్కాజిగిరిలో ఆదివారం జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ సన్నాహక సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన కేటీఆర్ మాట్లాడుతూ భవిష్యత్‌లో ఏ ఎన్నికలు వచ్చినా.. తెలంగాణకు కేసీఆర్ నాయకత్వమే శ్రీరామరక్ష అనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలన్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 16 నెలలు పూర్తయినా.. హైదరాబాద్‌లో ఒక్క అభివృద్ధి పనిని ప్రారంభించలేదన్నారు. తెలంగాణపై కేసీఆర్‌కు ఉన్న కడుపు నొప్పి..ప్రేమ ఢిల్లీ పార్టీలకు ఉంటుందా అని కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ నగరంలో 16 సీట్లు గెలిపించి హైదరాబాద్ ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకున్నారని చెప్పారు. మంచి నాయకుడు ఉంటే మంచి జరుగుతుందని గుర్తించి.. భవిష్యత్‌లో మోసపోవద్దన్నారు.
నగరంలో ఎక్కడి సమస్యలు అక్కడే
రేవంత్ పాలనలో హైదరాబాద్ అంతా ఆగమైపోయిందని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. మల్కాజిగిరిలో ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి మోరీల్లో పూడికలు తీయకపోతే మోరీల్లో కూర్చుంటున్నారని, శ్మశానవాటికను డంపింగ్ యార్డ్ చేస్తుంటే డంపింగ్ యార్డ్‌లో కుర్చుంటూ.. ప్రభుత్వాన్ని ప్రజల సమస్యలు పరిష్కరించాలని నిలదీస్తున్నారన్నారు. హైదరాబాద్ అంతటా ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయని, ప్రజలు ఇది గమనించాలన్నారు.
మహిళలకు ధన్యవాదాలు..
సన్నాహక సభకు ఎర్రటి ఎండలో హాజరైన మహిళలకు ధన్యవాదాలని కేటీఆర్ అన్నారు. భారీ సంఖ్యలో తరలివచ్చి కేసీఆర్‌ను ఆశ్వీరదించేందుకు వచ్చిన వారికి కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. వరంగల్‌లో జరిగే రజతోత్సవ సభకు తరలివచ్చి సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ రజతోత్సవ సన్నాహక భకు భారీ సంఖ్యలో తరలివచ్చిన బీఆర్ఎస్ శ్రేణులకు ధన్యావాదాలు తెలిపారు. ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు తదితరులు పాల్గొన్నారు.
కేటీఆర్ సమక్షంలో చేరికలు..
కేటీఆర్ సమక్షంలో జరిగిన సన్నాహక సభలో కాంగ్రెస్, బీజేపీ పార్టీల నేతలు భారీ సంఖ్యలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరికి గులాబీ కండువాలు వేసి కేటీఆర్ బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. ఈకార్యక్రమంలో కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్‌రెడ్డి, సబిత కిశోర్, సునీతా రాముయాదవ్, మాజీ కార్పొరేటర్లు జగదీశ్‌గౌడ్, మాజీ మున్సిపల్ ఛైర్మన్ సూర్యనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సన్నాహక సభకు భారీగా తరలివచ్చిన శ్రేణులు
సన్నాహాక సభకు భారీగా బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజలు తరలివచ్చి విజయవంతం చేశారు. వేలాది సంఖ్యలో తరలివచ్చిన ప్రజలు జై కేటీఆర్ కేటీఆర్ అంటూ నినాదాలు చేశారు. కేటీఆర్‌తో ఫోటోలు దిగేందుకు పోటీలు పడ్డారు.
గ్రేటర్ బీఆర్ఎస్లో రజతోత్సవ సంబురం
సిటీబ్యూరో, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ): గ్రేటర్ బీఆర్ఎస్లో రజతోత్సవ సంబురాలు అంబరాన్నంటుతున్నాయి. బీఆర్ఎస్ ఆవిర్భవించి 25 సంవత్సరాలవుతున్న సందర్భంగా ఈ నెల 27న వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో భారీ బహిరంగ సభకు శ్రేణులు సమాయాత్తమవుతున్నారు. ఈ వేడుకను ప్రతి కార్యకర్త ఇంట్లో పండుగ వాతావరణంలో జరుపుకునేలా భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నారు.
ఇందులో భాగంగానే ఈ నెల 8న తెలంగాణ భవన్లో పార్టీ ప్రజాప్రతినిధులు, నియోజకవర్గ ఇన్చార్జీలు, పార్టీ ముఖ్య నాయకులతో జరిగిన సమావేశంలో రజతోత్సవ సభ విజయవంతం చేసేలా దిశానిర్దేశం చేశారు. ఒక్కో నియోజకవర్గం నుంచి 3వేల మంది సభకు వెళ్లేలా కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేశారు. నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహిస్తూ శ్రేణులను సమాయత్తం చేస్తున్నారు.
తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చడానికి బీఆర్ఎస్ పార్టీని స్థాపించి అనేక పోరాటాలు చేసి రాష్ర్టాన్ని సాధించిన కేసీఆర్ గొప్ప పరిపాలనాదక్షుడని సన్నాహక సమావేశంలో నేతలు చెబుతున్నారు. ఉద్యమసారథియే తెలంగాణ మొదటి సీఎంగా ఉండటం వల్ల తెలంగాణ అభివృద్ధి వేగంగా జరిగిందని కొనియాడారు.
ఈ నెల 27న జరిగే బీఆర్ఎస్ వ్యవస్థాపక పండుగ తమ ఇంట్లో పండుగగా ప్రతి ఒక్క కార్యకర్త భావిస్తున్నట్టు పేర్కొంటున్నారు. గ్రేటర్లో కార్యకర్తలందరితో సమావేశం ఏర్పాటు చేసి వరంగల్‌కు బయలుదేరడంపై సమావేశాలు నిర్వహిస్తున్నట్టు నేతలు వివరిస్తున్నారు. సన్నాహక సమావేశంలో కేటీఆర్ పాల్గొంటుండడంతో శ్రేణుల్లో మరింత జోష్ నెలకొంది.