రెండున్నరేండ్లలో పేదల ఇండ్లు కూల్చడం, భూములను లాక్కొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడమే లక్ష్యంగా సీఎం రేవంత్‌రెడ్డి పాలన సాగుతున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. రాజేంద్రనగర్ పరిధిలోని హనుమాన్‌నగర్‌లో ఆదివారం కేటీఆర్ బస్తీబాట చేపట్టారు. బస్తీవాసులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. మూసీ సుందరీకరణను సాకుగా చూపుతూ.. మూసీకి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న హనుమాన్నగర్ను ఖాళీ చేయించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.
హైడ్రా, మూసీ పేరుతో బుల్డోజర్లను పేదల ఇండ్ల మీదకు పంపించి వారిని రోడ్డున పడేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హైడ్రా కేవలం పేద ప్రజల ఇండ్లను మాత్రమే కూలుస్తున్నదని.. ముఖ్యమంత్రి, ఆయన కుటుంబ సభ్యులు, మంత్రులకు వర్తించదా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీల పేరుతో ప్రజలకు మాయమాటలు చెప్పి ఒక్క గ్యారెంటీ కూడా అమలు చేయలేదని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నాయకుల మాయ మాటలు నమ్మొద్దని హనుమాన్‌నగర్ వాసులకు సూచించారు. హనుమాన్‌నగర్ ప్రజలకు న్యాయం జరిగేదాకా బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

సిటీ బ్యూరో, జూన్ 21 (నమస్తే తెలంగాణ) : హనుమాన్‌నగర్ ప్రజలు మరో ఏడాది పాటు తమ ఇండ్లను కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి కాపాడుకుంటే అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని..అప్పుడు బస్తీవాసులందరికీ ఇండ్ల పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చారు. 60 ఏండ్ల నుంచి నివాసముంటున్న పేదల ఇండ్లను ఖాళీ చేయిస్తామంటే చూస్తూ ఊరుకోబమని అన్నారు. హనుమాన్ నగర్ ప్రజలకు నోటీసులు ఇస్తే.. 60 ఏండ్ల నుంచి నివసిస్తున్న ప్రజలను ఎలా ఖాళీ చేయిస్తారని కోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుందని తెలిసే నోటీసులు ఇవ్వలేదని చెప్పారు. అందుకే బస్తీ ప్రజల మధ్య చిచ్చులు పెట్టి కొంతమందిని తమవైపునకు తిప్పుకునేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. బస్తీ ప్రజలంతా ఐకమత్యంగా ఉంటే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వచ్చినా ఒక్క ఇటుక కానీ.. ఇంటికి ఉన్న సున్నం కానీ ముట్టుకోలేరని భరోసా కల్పించారు.
భయపడకండి అండగా ఉంటాం
రాజేంద్రనగర్ పరిధిలోని హనుమాన్‌నగర్‌లో ఆదివారం కేటీఆర్ బస్తీబాట చేపట్టారు. బస్తీవాసులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకొని భయపడకండి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
ప్రజాపాలన కాదు.. దగా పాలన
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన అని చెప్పుకొంటూ దగాపాలన కొనసాగిస్తోంది. సీఎం రేవంత్‌రెడ్డి మూసీ సుందరీకరణ పేరు చెప్పి పేదల ఇండ్లు కూలగొట్టి, భూములను లాక్కొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. మూసీతో సంబంధం లేని హనుమాన్ నగర్‌ను ఎలా ఖాళీ చేయమంటారు? హనుమాన్ నగర్‌కు ఇన్ని రోజులు హనుమంతుడు కాపాడితే.. ఇప్పటి నుంచి కేటీఆర్ అండగా ఉండి కాపాడుతారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే హనుమాన్ నగర్ ప్రజలందరికీ పట్టాలు ఇప్పించే బాధ్యత తీసుకుంటున్నాం.
– కార్త్తీక్‌రెడ్డి, బీఆర్ఎస్ నేత
అధికారులు బెదిరిస్తున్నారు
బస్తీని ఖాళీ చేయాలని ప్రభుత్వ అధికారులు వచ్చి బెదిరిస్తున్నారు. ఎమ్మెల్యే దగ్గరకు వెళ్తే.. ఖాళీ చేయాల్సిందే అని అంటున్నారు. డబుల్ బెడ్రూంలు ఇస్తామని.. ముఖ్యమంత్రి ఖాళీ చేయాల్సిందేనని అంటున్నారని చెప్పారు. మాకు ఎక్కడా ఏ డబుల్ బెడ్రూంలు వద్దు. మేం ఇక్కడి నుంచి కదలం. మాకు ఇక్కడే ఇండ్ల స్థలాలకు పట్టాలు ఇవ్వాలి. ఇక్కడ కేటీఆర్ పర్యటనతో వచ్చే బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాకు ఇండ్ల పట్టాలు ఇస్తారనే నమ్మకం కలిగింది.
– నారాయణ స్వామి, హనుమాన్‌నగర్ బస్తీ అధ్యక్షుడు
ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి : మంచిరెడ్డి కిషన్‌రెడ్డి
కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అవినీతి, అడ్డగోలు పనులపై ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని రంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లాపై సీఎం రేవంత్‌రెడ్డి కన్నుపడిందని, ఇక్కడి భూములను తన అనుయాయులకు అక్రమదారిలో కట్టబెట్టడం, కబ్జాలు చేయడమే పరిపాటిగా మారిందని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో ప్రత్యేక దృష్టిపెట్టి.. బీఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని శ్రేణులకు పిలుపునిచ్చారు.
బూత్ ఏజెంట్లకు అవగాహన తప్పనిసరి : స్వామిగౌడ్
రాజకీయంగా ఎదగాలంటే ప్రధానంగా ప్లెక్సీలు, ప్రచారాల కన్నా…. పార్టీ సంస్థాగతంగా ఎలా ఉండాలనే అంశాలతోపాటు బూత్ లెవల్ ఏజెంట్లకు సంపూర్ణ అవగాహన ఉండాలని శాసనమండలి మాజీ చైర్మన్ కె.స్వామిగౌడ్ అన్నారు. చాలామంది లీడర్లు కేవలం ప్లెక్సీలు, అలంకార ప్రాయ రాజకీయాలు చేస్తున్నారే తప్ప ప్రజల్లోకి వెళ్లి క్షేత్రస్థాయిలో ప్రజలకు ఏవిధంగా అవగాహన కల్పించాలన్న పనిని మరిచిపోతున్నారన్నారు. బూత్ ఏజెంట్లకు అవగాహన కల్పిస్తూ ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లి సమస్యలపై పోరాటం చేయాలని సూచించారు.