సిటీబ్యూరో, సెప్టెంబరు 17 (నమస్తే తెలంగాణ) : జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీకి కంచుకోట.. వరుస విజయాలతో ఇక్కడ బీఆర్ఎస్ దూసుకుపోతున్నది.. హ్యాట్రిక్ ఎమ్మెల్యేల జాబితాలో ఒకరుగా నిలిచిన మాగంటి గోపీనాథ్.. పదేండ్ల బీఆర్ఎస్ హయాంలో రూ.వేల కోట్ల రూపాయలను ఖర్చు చేసి నియోజకవర్గాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. సంక్షేమ, అభివృద్ధి పథకాలతో ప్రజల గుండెల్లో బీఆర్ఎస్ చెక్కు చెదరని స్థానాన్ని సంపాదించుకున్నది.
ఈ నేపథ్యంలోనే 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 44 శాతం ఓట్ల షేర్ సాధించగా.. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 43.94శాతంతో మాగంటి గోపీనాథ్‌కు జనాలు పట్టం కట్టారు. అయితే జూబ్లీహిల్స్ నుంచి హ్యాట్రిక్ విజయాలు సొంతం చేసుకున్న మాగంటి గోపీనాథ్ మరణానంతరం ఆయన సతీమణి సునీతాకు టికెట్ ఇస్తే సెంటిమెంట్ వర్క్ అవుట్ అవుతుందని సీనియర్ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఈ తరుణంలోనే కాంగ్రెస్‌పై వ్యతిరేకత మాగంటిపై సానుభూతి కలిసొస్తుందని బీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు.
జూబ్లీహిల్స్‌లో ఎన్నిక ఏదైనా బీఆర్ఎస్కు ఉన్న ఓటు బ్యాంకు ఏ మాత్రం చెక్కు చెదరడం లేదన్నది గడిచిన పదేండ్ల కాలంలో వచ్చిన ఎన్నికలే ఇందుకు రుజువు చేస్తున్నాయి. మాగంటి గోపీనాథ్ నియోజకవర్గంలో ప్రత్యర్థి పార్టీలకు ఉనికి లేకుండా చేశారన్నది రాజకీయ నేతలే బహిరంగంగా చెబుతున్నారు. పదేండ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాగంటి ఇంటింటికే వెళ్లి కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ చెక్కులు అందజేశారు. పండగ ఏదైనా బహుమతులను అందజేసి అందరివాడిగా మాగంటిగా నిలిచారు. రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సారథ్యంలోనే పార్టీ బూత్ స్థాయిలో పటిష్టంగా ఉంది. లోకల్ క్యాడర్ గట్టిగా ఉండడం, మాగంటి గోపినాథ్ భౌతికంగా దూరమైన ఆయన పార్టీ పట్ల నిబద్ధతను, బీఆర్ఎస్ పార్టీ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లేలా గులాబీ శ్రేణులు కంకణబద్దులై కదం తొక్కుతున్నారు.
నియోజకర్గం పరిధిలోని ఏడు డివిజన్లలో ఒకటి రెండు మినహా అన్ని డివిజన్లలో గులాబీ పార్టీకి చెందిన కార్పొరేటర్లే ఉన్నారు. 2020 సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో షేక్‌పేట, ఎర్రగడ్డ డివిజన్లు మినహా మిగిలిన డివిజన్లలో బీఆర్ఎస్ సత్తా చాటింది. బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన ఒకరిద్దరు ఇతర పార్టీలో చేరిన డివిజన్లలో తిరుగులేని శక్తిగా బీఆర్ఎస్ అవతరించింది. బలమైన క్యాడర్‌తో ఉప ఎన్నికల్లోనూ తమ సత్తా చాటుతామని బీఆర్ఎస్ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.