KTR | తెలంగాణ రాష్ట్రం పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. తుగ్లక్ పరిపాలన ఎలా ఉంటుందో ఇవాళ రాష్ట్రంలో ప్రత్యక్షంగా చూస్తున్నామని కేటీఆర్ అన్నారు. ఆరు గ్యారంటీలు, 420 హామీలు అని చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని తెలిపారు. అధికారంలోకి వచ్చాక ఆరు గ్యారంటీలు అటకెక్కాయని.. 420 హామీలు ఏమయ్యాయో తెలియదని వ్యాఖ్యానించారు.
హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. సికింద్రాబాద్, హైదరాబాద్లది శతాబ్దాల చరిత్ర అని తెలిపారు. 1500 సంవత్సరంలో హైదరాబాద్ నగరానికి కులీకుతుబ్ షా బీజం వేశారని పేర్కొన్నారు. సికింద్రాబాద్, హైదరాబాద్ రెండు కళ్లు అని.. అందుకే అవి ట్విన్ సిటీస్గా పేరుగాంచాయని అన్నారు. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి సికింద్రాబాద్ ఐడెంటిటీని తొలగించాలని చూస్తున్నాడని మండిపడ్డారు. అందుకే అన్ని వర్గాల ప్రజలు ఒక్కటై ర్యాలీకి సిద్ధమయ్యారని తెలిపారు. పార్టీలకు అతీతంగా శాంతియుత ర్యాలీకి పిలుపునిచ్చారని అన్నారు. శాంతి ర్యాలీకి బీఆర్ఎస్ పార్టీని కూడా ఆహ్వానించారని తెలిపారు. మా ప్రజాప్రతినిధులమంతా సంఘీభావం తెలుపుదామని సిద్ధమయ్యామని పేర్కొన్నారు. కానీ వేలాది మందిని ఎక్కడికక్కడ అరెస్టులు చేశారని తెలిపారు. తమను కూడా తెలంగాణ భవన్లో నిర్బంధించారని చెప్పారు.
అరెస్టులు చేసి పైశాచిక ఆనందం పొందుతున్నారని కేటీఆర్ విమర్శించారు. కోర్టుకు వెళ్లి న్యాయం కోసం పోరాడుతామని స్పష్టంచేశారు. రిపబ్లిక్ డేకు పది రోజుల ముందు తెలంగాణలో హక్కుల ఖూనీ జరిగిందని అన్నారు. రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకుని తిరుగుతున్నాడని.. మరి ఇదేనా మీ ప్రజాస్వామ్యం అని మండిపడ్డారు. సికింద్రాబాద్ బిడ్డలకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. మా ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సికింద్రాబాద్ జిల్లా చేసే ఆలోచన చేస్తామని తెలిపారు.