Dhanush | కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటించిన తాజా రూరల్ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా ‘కర’ (Kara) థియేటర్లలో విడుదలైన నెల రోజుల్లోపే ఓటీటీలోకి రాబోతుంది. ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ఫ్లిక్స్ (Netflix) ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను దక్కించుకుంది. మే 28 (2026) నుండి ఈ చిత్రం నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారికంగా మేకర్స్ ప్రకటించారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం మరియు హిందీ భాషల్లో ఈ చిత్రం అందుబాటులో ఉండబోతుంది. మమితా బైజు (మలయాళ ‘ప్రేమలు’ ఫేమ్) ఇందులో కథానాయికగా నటించగా.. కేఎస్ రవికుమార్, జయరామ్, సూరజ్ వెంజరమూడు కీలక పాత్రల్లో నటించారు. విఘ్నేశ్ రాజా దర్శకత్వం వహించాడు.
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ఇది 1991 గల్ఫ్ వార్ (Gulf War) నేపథ్యంలో సాగే ఒక పీరియడ్ యాక్షన్ థ్రిల్లర్. ఇందులో కరస్వామి అలియాస్ కర (ధనుష్) ఒక ప్రొఫెషనల్ దొంగ. తాను ప్రాణంగా ప్రేమించిన మల్లి (మమితా బైజు) కోసం ఆ నేర జీవితాన్ని వదిలేసి, సొంతంగా ఒక హోటల్ పెట్టుకుని బతకాలని అనుకుంటాడు. పెట్టుబడి కోసం తన ఊరిలో ఉన్న తాతల నాటి పొలం కాగితాలను బ్యాంకులో తాకట్టు పెట్టాలని ప్లాన్ చేస్తాడు. కానీ, కొన్ని అనుకోని పరిస్థితుల్లో ఆ పొలాన్ని బ్యాంకు జప్తు చేస్తుంది. దాంతో తన కుటుంబ ఆస్తిని కాపాడుకోవడానికి కర మళ్లీ దొంగగా మారాల్సి వస్తుంది. ఒకే బ్యాంకుకు చెందిన వివిధ బ్రాంచ్లలో బ్యాంక్ రాబరీలకు పాల్పడుతుంటాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేదే సినిమా కథ.