Priyanka Chopra | ప్రముఖ హాలీవుడ్ పాప్ సింగర్, ప్రియాంకా చోప్రా భర్త, నటుడు నిక్ జోనస్ ఒక డిస్నీ సినిమా చూసిన ప్రతిసారీ భావోద్వేగానికి గురవుతానని, తన కళ్లలో నీళ్లు తిరుగుతాయని చెప్పుకొచ్చాడు. అయితే ఆ చిత్రం మరేదో కాదు.. ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ పొందిన యానిమేషన్ క్లాసిక్ ‘ది లయన్ కింగ్’ (The Lion King). న్యూయార్క్ నగరంలో అతడు నటించిన తాజా చిత్రం ‘పవర్ బల్లాడ్’ (Power Ballad) మీడియా ప్రమోషన్స్‌లో నిక్ జోనస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా హోస్ట్ జోష్ హొరోవిట్జ్.. మిమ్మల్ని ఎప్పుడైనా బాగా కదిలించిన పాటలు లేదా సినిమాలు ఉన్నాయా? అని నిక్ జోనస్‌ను ప్రశ్నించారు.
దీనికి నిక్ స్పందిస్తూ, తన నాలుగేళ్ల కుమార్తె మాల్తీ మేరీతో కలిసి చూసే విషయాలపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. “నా కొత్త సినిమాలో నేను లేని రెండు సన్నివేశాలు ఉన్నాయి. ఒక తండ్రిగా అవి నా హృదయాన్ని ఎంతగానో హత్తుకున్నాయి. కుటుంబం, ఆ బంధాల గురించిన భావోద్వేగాలను అవి గుర్తు చేస్తాయి. ఇక ఇది కాకుండా, నేను ఏ సినిమా చూసి ఎక్కువ ఏడుస్తానంటే.. అది కచ్చితంగా ‘ది లయన్ కింగ్’ చిత్రమే. చిన్నప్పుడు నన్ను ఎంతగానో ప్రభావితం చేసి, నా వ్యక్తిత్వాన్ని మలిచిన ఇలాంటి కథలను ఇప్పుడు నా కుమార్తెతో కలిసి చూడటం, ఆ అనుభవాలను ఆమెతో పంచుకోవడం నిజంగా ఒక ప్రత్యేకమైన అనుభూతి” అని నిక్ జోనస్ చెప్పుకొచ్చారు. అంతేకాకుండా ఫ్లైట్లలో ప్రయాణించేటప్పుడు సినిమాలు చూస్తూ తాను ఎప్పుడూ ఎమోషనల్ అవుతుంటానని కూడా ఆయన నవ్వుతూ చెప్పారు.
కాగా, నిక్ జోనస్ – ప్రియాంకా చోప్రా దంపతులకు 2022లో సరోగసీ ద్వారా కుమార్తె మాల్తీ మేరీ జన్మించిన సంగతి తెలిసిందే. ఇటీవలె ప్రియాంకా చోప్రా సైతం ఒక పాడ్‌కాస్ట్‌లో పాల్గొని తమ కుమార్తె పెంపకం గురించి మాట్లాడారు. మాల్తీ పెద్దదవుతున్న కొద్దీ ఆమెకు వీలైనంత వరకు సాధారణ జీవితాన్ని, ప్రైవసీని ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నామని, లోకంలో మంచి వ్యక్తులు కూడా ఉంటారనే నమ్మకంతో ఆమె భయం లేకుండా పెరగాలని కోరుకుంటున్నట్లు ప్రియాంక పేర్కొన్నారు.