అడ్డగుట్ట, మే 26: ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ క్వార్టర్స్ లీజు అనుమతిని ఆది ధ్వని సొసైటీకి ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని.. వెంటనే సంబంధిత లీజును రద్దచేయాలని కోరుతూ బీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఓయూ రిజిస్ట్రార్‌కు సోమవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థి నాయకులు మాట్లాడుతూ… ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ క్వార్టర్స్‌ని ఆదిధ్వని సంస్థ పేరుతో 30 సంవత్సరాలు లీజుకి ఇవ్వాలని యూనివర్సిటీ అధికారులు ఒప్పందం చేసుకున్నారని అన్నారు.
జస్టిస్ చిన్నప్పరెడ్డి కమిషన్‌కి విరుద్ధంగా ప్రైవేటు వ్యక్తులకు యూనివర్సిటీ అధికారుల భూమిని కేటాయించడం విడ్డూరంగా ఉందన్నారు. వర్సిటీ భూములు అన్యాక్రాంతం అవుతుంటే కాపాడాల్సింది పోయి ఉన్న భూములను నిబంధనలకు విరుద్ధంగా లీజుకు ఇవ్వడం ఏంటని వారు ప్రశ్నించారు. లీజు రద్దుచేయని పక్షంలో ఆందోళనలను ఉధృతం చేస్తామన్నారు. వినతిపత్రం ఇచ్చినవారిలో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి జంగయ్య, నాయకులు.. ప్రశాంత్, మిథున్, నాగేందర్రావు, అవినాష్, వినోద్, సతీష్ తదితరులు ఉన్నారు.
ఉపసంహరించుకోవాలి
సికింద్రాబాద్, మే 26: ఓయూ ప్రొఫెసర్స్ క్వార్టర్స్‌ను ‘ఆది ధ్వని’ సంస్థ పేరుతో ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టాలని చూస్తే ఊరుకునేది లేదని ఏబీవీపీ ఓయూ నాయకులు హెచ్చరించారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఉస్మానియా యూనివర్సిటీ శాఖ ఆధ్వర్యంలో సోమవారం రిజిస్ట్రార్‌కి వినతిపత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘం యూనివర్సిటీ అధ్యక్షుడు దృహన్ గ్రేటర్ హైదరాబాద్ సిటీ సెక్రటరీ పృథ్వి తేజ, జాతీయ కార్యవర్గ సభ్యులు జీవన్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రాజు,రాష్ట్ర కార్యసమితి సభ్యులు కమల్ సురేష్, విద్యార్థి నాయకులు పాల్గొన్నారు.
లీజుతో నాకు సంబంధం లేదు
ఉస్మానియా యూనివర్సిటీలోని ప్రొఫెసర్స్ క్వార్టర్స్ లీజు వ్యవహారంతో తనకు సంబంధం లేదని మాజీ వీసీ రవీందర్ అన్నారు. తాను వీసీగా ఉన్నప్పుడు ఏ సంస్థకు గానీ, ట్రస్ట్‌కు గానీ లీజుకు ఇవ్వలేదన్నారు. దానకిషోర్ ఇన్చార్జిగా ఉన్నప్పుడే పీ-3 క్వార్టర్స్‌ను లీజుకు ఇచ్చినట్లు ప్రస్తుతమున్న వీసీ కుమార్ చెప్పారని గుర్తుచేశారు. తన హయాంలో ప్రొఫెసర్ క్వార్టర్స్‌ను ఆది ధ్వని ట్రస్టుకు లీజుకిచ్చినట్లు మీడియాలో వస్తున్న కథనాలు పూర్తిగా అవాస్తవమని ఆయన స్పష్టం చేశారు. ఇకపై తనపై ఎవరైనా తప్పుడు ఆరోపణలు చేస్తే సహించేది లేదన్నారు.