బంజారాహిల్స్,మే 26: బంజారాహిల్స్ డివిజన్ పరిధిలోని ఉదయ్‌నగర్‌లో తాగునీటి సమస్యలను పరిష్కరించాలంటూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో స్థానికులు జలమండలి కార్యాలయాన్ని ముట్టడించారు. మంగళవారం బంజారాహిల్స్ రోడ్ నెం 7లోని జలమండలి కార్యాలయం వద్ద బీఆర్ఎస్ ఖైరతాబాద్ నియోజకవర్గం ఇన్చార్జి మన్నె గోవర్ధన్‌రెడ్డి, బీఆర్ఎస్ నేత శ్రీనివాసునాయుడు, మాజీ కార్పొరేషన్ చైర్మన్ విప్లవ్కుమార్తో పాటు సీనియర్ నేతలు, కార్యకర్తలు బైఠాయించారు. సీఎం రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
చేతగాని ప్రభుత్వం ప్రజలకు తాగునీళ్లు కూడా ఇవ్వలేని దుస్థితిలో ఉందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండునెలలుగా ఉదయ్‌నగర్‌లో లో ప్రెషర్ సమస్యలు ఉన్నాయని, మూడురోజులకొకసారి నీళ్లు ఇస్తున్నారని స్థానికులు మండిపడ్డారు. గతంలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితి చూడలేదని, అర్ధరాత్రి దాకా వేచి ఉన్నా నీళ్లు మాత్రం రావడం లేదంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సుమారు గంటసేపు ట్యాంకర్లను బయటకు వెళ్లనీయకుండా ఆందోళన చేపట్టిన స్థానికులు, బీఆర్ఎస్ కార్యకర్తలు జలమండలి అధికారులకు వినతిపత్రం అందజేశారు. నాయకులు సుజాత, రావుల విజయ్‌కుమార్, నాగరాజు పాల్గొన్నారు.