నగరం గులాబీ మయమైంది.. నలుదిక్కులూ.. జై బీఆర్ఎస్.. జైజై కేసీఆర్ నినాదాలతో ప్రతిధ్వనిస్తున్నాయి.. బీఆర్ఎస్ 25 వసంతాల వేడుక..తమ ఇంటి పండుగగా భావిస్తూ.. భాగ్యనగరవాసులు.పోరాటాల గడ్డ ఓరుగల్లు బాటపడుతున్నారు. ఒకవైపు ఎండలు మండుతున్నా.. గుండెల నిండా కేసీఆర్‌పై ఉన్న అభిమానంతో ఆదివారం ఎల్కతుర్తి వేదికగా జరిగే రజతోత్సవ సభకు బయలెల్లుతున్నారు. తెలంగాణ పాటల ధూందాంతో.. బస్సులు, బైక్‌ల ర్యాలీ తీసుకుంటూ.. గులాబీ శ్రేణులు వరంగల్ చేరుకుంటున్నాయి. గ్రేటర్ నుంచి భారీ సంఖ్యలో సభా ప్రాంగణానికి చేరుకోబోతున్నారు. ఈ నేపథ్యంలో సిటీలోని ప్రధాన రహదారులన్నీ ‘గులాబీ’ వర్ణంతో కళకళలాడుతున్నాయి.
-సిటీబ్యూరో, ఏప్రిల్ 26 (నమస్తే తెలంగాణ)
గ్రేటర్లో అన్నీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, నాయకులు శనివారం బీఆర్ఎస్ జెండాలు ఎగురవేసి పండుగ చేశారు. కార్యకర్తలు, ప్రజలు ఒకరినొకరు శుభాకాంక్షలు చెప్పుకొన్నారు. ఓరుగల్లు సభకు పెద్ద ఎత్తున తరలిరావాలని మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, మహమూద్ అలీ, పద్మారావు గౌడ్, ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేశ్, మాగంటి గోపీనాథ్, ముఠా గోపాల్, వివేకానంద్, మర్రి రాజశేఖర్‌రెడ్డి తదితరులంతా కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. సంబంధిత నియోజకవర్గాల నాయకులు ప్రధాన ప్రాంతాల్లో ఫ్లెక్సీలు, బ్యానర్లతో నగరాన్ని గులాబీమయం చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా కార్యకర్తల సమక్షంలో కేకులు కట్ చేసి వేడుకలను ప్రారంభించారు. తెలంగాణ పాటలు ఆలపిస్తూ సందడి చేశారు.
ఫొటోలు దిగి..పోస్ట్ చేసి..
కేసీఆర్, గులాబీ జెండాల చిత్రపటాలతో సోషల్ మీడియా నిండిపోయింది. బీఆర్ఎస్ 25 ఏండ్ల జెండా పండుగకు తరలివెళ్తున్నామంటూ.. ఫొటోలు దిగి ఇన్‌స్టా, ఎక్స్, వాట్సాప్ స్టేటస్, ఫేస్‌బుక్‌ల్లో అప్లోడ్ చేసి నెటిజన్లు తమ అభిమానాన్ని చాటుకున్నారు. ‘జై కేసీఆర్’ అంటూ అప్పటి ఉమ్మడి పాలనను యాద్జేసుకొని.. కేసీఆర్ మళ్లీ సీఎం కావాలంటూ పోస్టులు పెట్టారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర గడిచినా ఒరిగిందేమీలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎల్కతుర్తికి రవాణా కార్మికులు..
గ్రేటర్‌కు చెందిన రవాణా రంగ కార్మికులు ఎల్కతుర్తి సభకు పయనమయ్యారు. ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు వారి వారి వాహనాల్లో తరలివెళ్లారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మొదటగా నష్టపోయింది తామేనని ఆటో డ్రైవర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ను ఈ రాష్ట్రం నుంచి తరిమి మళ్లీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా తాము పనిచేస్తామని చెప్పారు. బీఆర్టీయూ ఆటో యూనియన్ అధ్యక్షుడు వేముల మారయ్య ఆధ్వర్యంలో ఆటో కార్మికులు గులాబీ జెండాలను రెపరెపలాడిస్తూ సభకు తరలివెళ్లారు.