BRS Party | కుత్బుల్లాపూర్, మార్చి14 : తన చేతకానీ తనాన్ని కప్పిపుచ్చుకోవడానికి డైవర్షన్ రాజకీయాలు చేస్తూ చిల్లర మాటలు మాట్లాడుతూ విద్వేషాలను రెచ్చగొట్టే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ శుక్రవారం బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి వివేకానంద్, ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజులు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇటీవల నగరంలోని రవీంద్రభారతిలో తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన నియామక పత్రాల పంపిణీ కార్యక్రమంలో బిఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్ రెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అనేక ఉద్యమాలు చేసి, రాష్ట్రాన్ని సాధించి, ప్రజలతో ఎన్నుకోబడి బంగారు రాష్ట్ర సాధనకై కృషి చేసిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చావు కోరుతూ అనుచిత వ్యాఖ్యలు చేసి రాష్ట్ర ప్రజలు, కేసీఆర్ అభిమానుల ఆత్మాభిమానాన్ని కించపరిచేలా రెచ్చగొడుతూ అనుచిత వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను తెలంగాణ సమాజం ఎప్పటికీ క్షమించదన్నారు.
ముఖ్యమంత్రి వ్యాఖ్యలతో రాష్ట్ర ప్రజలు సంయమనాన్ని కోల్పోవద్దని, కాలమే వారికి సరైన బుద్ధి చెబుతుందని, కేసీఆర్ తెలంగాణ సమాజంతో పెట్టుకున్న వారు కాలగర్భంలో కలిసిపోయారన్నారు. తమ స్వార్థ చిల్లర రాజకీయాల కోసం బిఆర్ఎస్ అధినేత కేసీఆర్పై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తమ స్వార్థం కోసం ఎదుటివారి నాశనాన్ని కోరుకునే నైజాన్ని, ముఖ్యమంత్రి మానసిక స్థితిని తెలియజేస్తున్నాయని అన్నారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఎదుటివారి వినాశనాన్ని కోరుకోవడం సిగ్గుచేటని, రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు తెలంగాణ ప్రజలను, కేసీఆర్ అభిమానులను, కార్యకర్తలను తీవ్ర మనోవేదనకు గురిచేసాయని, తమ స్వార్థ రాజకీయాల కోసం చిల్లర మాటలు మాట్లాడుతూ విద్వేషాలను రెచ్చగొట్టి, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.