BRS Party | మణికొండ, మార్చి 24 : ప్రజా సమస్యల పరిష్కారం కోసమే నిరంతరం మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని ప్రతి కాలనీలో ప్రజాభిప్రాయ సేకరణను గుడ్ మార్నింగ్ మణికొండ పేరిట నిర్వహిస్తున్నామని మణికొండ మున్సిపాలిటీ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సీతారాం దూళిపాళ్ల అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా సోమవారం మున్సిపాలిటీ పరిధిలోని అంజలి గార్డెన్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా కాలనీవాసులు అనేక సమస్యలను నాయకుల దృష్టికి తీసుకువచ్చారు. ప్రధానంగా త్రాగునీరు, రహదారుల అస్తవ్యస్తం, డ్రైనేజీ వ్యవస్థ, విద్యుత్ సరఫరాల అంతరాయం లాంటి అంశాలను ప్రధానంగా నాయకుల ముందుకు తీసుకువచ్చారు.
అంజలి గార్డెన్ కాలనీవాసులు నాయకుల ముందు తీసుకువచ్చిన ప్రధాన అంశాలు ఇవే..
1. ల్యాంకో హిల్స్ నుంచి ఎగుడు దిగుడు రహదారులతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, రేడియేల్ రోడ్ అసంపూర్తిగా ఉన్న కారణంగా ప్రధాన రహదారిగా మారడంతో ట్రాఫిక్ సమస్య ఉండి ప్రమాదాలకు తావిస్తున్నదని అందువలన కొన్ని చోట్ల స్పీడ్ బ్రేకర్ అవసరం ఎంతైనా ఉందని మొరపెట్టుకున్నారు.
2. కాలనీ రహదారి మధ్య మధ్యలో డ్రైనేజీ లైన్‌పై దెబ్బతిని ఎప్పుడు కుంచించుకు పోతుందో ఎప్పుడు ప్రమాదం జరుగుతుందో తెలియకుండా ఉన్నదని భయబ్రాంతులలో స్థానిక ప్రజలు తెలియజేశారు. కొన్ని ఇండ్లకు ఇప్పటికీ డ్రైనేజీ వ్యవస్థ లేదని వాపోయారు.
3. మంచినీటి సరఫరా కేవలం అర గంట నుంచి 45 నిమిషాలు మాత్రమే ఉంటుందని, దీంతో తీవ్ర నీటి ఎద్దడి ఎదుర్కొంటున్నామని వాపోయారు.
4. ఈఐపీఎల్ అనే నిర్మాణ రంగ సంస్థ ఎలాంటి అనుమతులు లేకుండా జనవాసాల మధ్య ఏర్పాటు చేసిన రెడీమిక్స్ ప్లాంట్‌తో వాయు కాలుష్యంతో దగ్గు, దమ్ము బారిన పడి స్థానికులు నానా ఇబ్బంది పడుతున్నారని బాధపడ్డారు.
5. స్థానిక పిల్లలు, పెద్దలు వీధి కుక్కల బారిన పడి ఇబ్బంది పడుతున్నారనీ నాయకుల దృష్టికి తీసుకువచ్చారు. అంజలి గార్డెన్స్ కాలనీ వాసులు ఎదుర్కొంటున్న సమస్యలపై త్వరలోనే ఉన్నతాధికారుల బృందాన్ని కలిసి వినతి పత్రాలు అందజేసి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు కాలనీవాసులకు భరోసా కల్పించారు.
ఈ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షుడు సీతారాం ధూళిపాళ, కుంభగల్ల ధనరాజ్, గుట్టమీది నరేందర్, ఉపేంద్ర నాథ్ రెడ్డి, కిరణ్ యాలాల, సుమనళిని, బొడ్డు శ్రీధర్, రమణ మూర్తి తదితరులు పాల్గొన్నారు.