సిటీబ్యూరో, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ) : వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఉప్పల్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలుపు ఏకపక్షమే కాబోతున్నది. ఈ నియోజక వర్గంలో పరిస్థితులు అలాగే ఉన్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ తరఫున ఉప్పల్ నియోజకవర్గం నుంచి పోటీలో ఉన్న బండారి లక్ష్మారెడ్డి ప్రచారంలో జోరు పెంచారు. అందులో భాగంగా పలు ప్రచార రథాలు ఏర్పాటు చేయడంలో పాటు నియోజక వర్గంలోని ప్రతి డివిజన్ పరిధిలో ప్రచారం జోరుగా సాగుతున్నది. అందులో భాగంగా అభ్యర్థి ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. బీఆర్ఎస్ తొమ్మిదేండ్ల పాలనలో ఉప్పల్ నియోజక వర్గంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు తీరును వివరిస్తూ ఇంటింటికీ ప్రచారం చేస్తున్నారు. ఈ నియోజక వర్గంలో దాదాపు 5.10 లక్షల మంది ఓటర్లు ఉన్నప్పటికీ వారిలో సింహాభాగం కూడా బీఆర్ఎస్ పార్టీకే ఓట్లు వేయాలన్న ఆకాంక్షతోనే ఉన్నట్లు స్థానిక ప్రజలు, బీఆర్ఎస్ నాయకులు, క్యాడర్ తమ అభిప్రాయాలు వెలిబుచ్చుతున్నారు. పైగా వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ కాకుండా కాంగ్రెస్, బీజేపీ వంటి ఇతర పార్టీల అభ్యర్థులు గెలిస్తే.. అభివృద్ధి కుంటుపడటంతో పాటు ఎంతో మంది పేదలకు సకాలంలో అందుతున్న సంక్షేమ పథకాలు నిలిచిపోతాయన్న ఆందోళన ఉంది. మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలోకి వచ్చినట్లయితే.. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో ఉప్పల్ నియోజక వర్గం ఊహించని విధంగా అభివృద్ధి జరుగుతుందన్న అభిప్రాయాన్ని ఇక్కడి ప్రజలు వ్యక్తం చేస్తున్నారు.
క్యాడర్లో సమన్వయ లోపం..
బీఆర్ఎస్ పార్టీ మినహా.. కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చెందిన నాయకులు, క్యాడర్లో సమన్వయం లోపించినట్లు కనిపిస్తున్నది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుల విషయంలో సమన్వయం తీవ్రంగా లోపించింది. ఆ పార్టీకి చెందిన సీనియర్ల మధ్య పొసగడం లేదు. అయితే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థిని నిలబెట్టినప్పటికీ ఆయనకు సీనియర్లు, జూనియర్లతో పాటు ఆ పార్టీ క్యాడర్ కూడా అంతగా సహకరించడం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పైగా పార్టీ సీనియర్లకు కాకుండా ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికే కాంగ్రెస్ పార్టీ టికెటు ఇచ్చిందన్న అపవాదు ఉన్నందున తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతున్నది. బీఆర్ఎప్ పార్టీ అభ్యర్థి ప్రచార వ్యూహాలు రచించుకుంటూ ముందుకు సాగుతుంటే, కాంగ్రెస్, బీజేపీకి చెందిన నాయకులు మాత్రం ప్రచారంలో నిమ్మకు నీరెత్తినట్లుగా ఉన్నారు.
బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు తథ్యం..
ఉప్పల్ నియోజక వర్గంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలుపు ఏక పక్షమే. అందుకోసం ప్రచార జోరు, వ్యూహాలతో ముందుకు సాగుతున్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల ప్రకారం ఇదే జోరు నగరానికి చెందిన అన్ని నియోజక వర్గాల నుంచి పోటీ చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు కొనసాగిస్తున్నారు. నగరం పరిధిలో అన్ని నియోజక వర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు ఏకపక్షమే కాబోతున్నదని, ఇందుకు నగర అభివృద్ధి, సంక్షేమ ఫలాలు, షాదీముబారక్, ఆసరా పించన్లు, డబుల్బెడ్రూమ్ ఇండ్లు, తదితర పథకాలు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపునకు దోహదపడుతాయని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.