కంటోన్మెంట్, నవంబర్ 3: అసెంబ్లీ ఎన్నికల్లో కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలుపు సునాయాసం కాబోతుంది. ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థి లాస్యనందిత మొదటి దఫా ఎన్నికల ప్రచారాన్ని ముగించేసింది. కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి పోటీలో ఉన్న లాస్య నందిత ప్రచారంలో జోరు పెంచడంతో పాటు అన్ని వర్గాల ప్రజలను కలుపుకుని ముందుకు సాగుతున్నారు. అందులో భాగంగా పలు ప్రచార రథాలు ఏర్పాటు చేయడంలో పాటు నియోజక వర్గంలోని ప్రతి వార్డులో, మోండా డివిజన్ పరిధిలో ఆమెకు మద్దతుగా ప్రచారం జోరుగా సాగుతుంది. బీఆర్ఎస్ తొమ్మిదేండ్ల పాలనలో కంటోన్మెంట్ నియోజక వర్గంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు తీరును వివరిస్తూ ఇంటింటికీ ప్రచారం చేస్తున్నారు. మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని, సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో కంటోన్మెంట్ నియోజక వర్గం ఊహించని విధంగా అభివృద్ధి జరుగుతుందన్న అభిప్రాయాన్ని ఇక్కడి ప్రజలు వ్యక్తం చేస్తున్నారు.
బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు తథ్యం
కంటోన్మెంట్ నియోజక వర్గంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలుపు తథ్యంగా కనిపిస్తుంది. అందుకోసం ప్రచార జోరు, వ్యూహాలతో ముందుకు సాగుతున్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల ప్రకారం ఇదే జోరు నగరానికి చెందిన అన్ని నియోజక వర్గాల నుంచి పోటీ చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు కొనసాగిస్తున్నారు. నగరం పరిధిలో అన్ని నియోజక వర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు ఏకపక్షమే కాబోతున్నదని, ఇందుకు నగర అభివృద్ధి, సంక్షేమ ఫలాల్లో భాగంగా షాదీముబారక్, ఆసరా పింఛన్లు, డబుల్బెడ్రూమ్ ఇండ్లు, తదితర పథకాలు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపునకు దోహదపడుతాయని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ప్రధానంగా కంటోన్మెంట్లో దివంగత ఎమ్మెల్యే సాయన్న చేసిన అభివృద్ధితో పాటు సీఎం కేసీఆర్ ఈ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించడంతో లాస్యనందిత గెలుపు తథ్యమన్నారు.
విపక్ష పార్టీల్లో సమన్వయ లోపం
బీఆర్ఎస్ పార్టీ మినహా.. కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చెందిన నాయకులు, పార్టీ శ్రేణుల్లో సమన్వయం లోపించినట్లు కనిపిస్తున్నది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుల విషయంలో సమన్వయం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. గద్దర్ కూతురు వెన్నెలకు టికెట్ కేటాయించడంపై అసంతృప్తిగా ఉన్న పలువురు నేతలు కారెక్కేందుకు సిద్ధమయ్యారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ల మధ్య పొసగడం లేదు.ఇదిలా ఉండగా ఇప్పటి వరకు కాషాయం పార్టీ అభ్యర్థినిని కూడా ప్రకటించలేని స్థితిలో ఉంది. ఓ వైపు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ప్రచార వ్యూహాలు రచించుకుంటూ ముందుకు సాగుతుంటే, కాంగ్రెస్, బీజేపీకి చెందిన నాయకులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా ఉన్నారు