MLA Talasani | అమీర్‌పేట్, మార్చి 16 : రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి డి. పార్థసారథి నేతృత్వంలో కొనసాగుతున్న శ్రీనివాస చారిటబుల్ ట్రస్ట్ చేపడుతున్న సామాజిక సేవా కార్యక్రమాలకు కార్పొరేట్ సంస్థలు బ్రహ్మరథం పడుతుండడం అభినందనీయమని సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. ఓవైపు వయోభారం ఇబ్బందులు పెడుతున్న.. సామాజిక సేవా కార్యక్రమాల పట్ల తమ నిబద్ధతను చాటుకుంటూ ఎస్సార్ నగర్‌లోని వయోధిక సంఘం ప్రతినిధులు నిర్వహిస్తున్న తమ బాధ్యతలను ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రత్యేకంగా ప్రశంసించారు.
ఆస్టర్ ప్రైమ్ ఆసుపత్రి, ఆస్టర్ డిఎం ఫౌండేషన్ వారు ఎస్ఆర్ నగర్‌లోని శ్రీనివాస సమాజ సేవ చారిటబుల్ ట్రస్ట్ చేపడుతున్న సామాజిక సేవలను గుర్తిస్తూ సిఎస్ఆర్ పథకం కింద ట్రస్ట్‌కు రూ.10 లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. ఆదివారం ఉదయం ట్రస్ట్ కార్యాలయం ఆవరణలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆస్టర్ డిఎం ఫౌండేషన్ ప్రతినిధులు డాక్టర్ సుష్మ, డాక్టర్ రవి శంకర్‌లతో కలిసి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ రూ. 10 లక్షల చెక్కును ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి డీ పార్థసారథికి అందజేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ఎన్ శేషు కుమారితో పాటు ట్రస్టు ప్రతినిధులు మాణిక్ రావు పాటిల్, బిచ్చప్ప, ఎస్ఆర్ నగర్ వయోధికుల మండలి ప్రధాన కార్యదర్శి కృష్ణదేవ్గౌడ్, బిఆర్ఎస్ నాయకులు కొలను బాల్ రెడ్డి, ఎం.హనుమంతరావు, కూతురు నరసింహ, దాడి ప్రవీణ్ రెడ్డి, వడ్డే కరుణాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.