MLA Sudheer Reddy | చంపాపేట, ఏప్రిల్ 26 : ఈ నెల 27న వరంగల్లో జరగబోయే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవీరెడ్డి సుధీర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ విషయమై నియోజకవర్గం పరిధిలోని లింగోజిగూడ డివిజన్లో బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు వరప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో డివిజన్ పరిధిలో జెండాల ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే హాజరై పార్టీ శ్రేణులతో కలిసి బీఆర్ఎస్ జెండాలను ఆవిష్కరించారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ…. రేపు వరంగల్లో జరిగే పార్టీ రజతోత్సవ సభకు పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో హాజరై సభ విజయవంతం అయ్యేట్లు ఆయా డివిజన్లలోని బాధ్యులు కృషి చేయాలని సూచించారు. పార్టీ ప్రతిష్టను పెంచేందుకు కృషి చేసే ప్రతి కార్యకర్తకు, నాయకులకు బీఆర్ఎస్ పార్టీలో తప్పకుండా గుర్తింపు లభిస్తుందని వారన్నారు. ఈ సభను మన ఇంటి పండుగగా భావించి పార్టీ శ్రేణులు అందరూ సభకు తరలి రావడంతో పాటు పార్టీ సానుభూతిపరులను సభకు తరలించాలని పార్టీ శ్రేణులకు ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు తిలక్ రావు, రాజశేఖర్ రెడ్డి, సీనియర్ నాయకులు, పార్టీ పలు విభాగాల నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.