MLA Sudheer Reddy | వనస్థలిపురం, మార్చి 13 : ప్రజలకు పార్కులతో పాటు, యువతకు క్రీడాస్థలాలు కూడా అవసరమే అని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అన్నారు. బుధవారం బిఎన్ రెడ్డి నగర్ డివిజన్లో ఆయన పర్యటించారు. బీఎన్ రెడ్డి నగర్ ఫేజ్-3లో నూతనంగా నిర్మించిన పార్కును పరిశీలించి అనంతరం బీఎన్ రెడ్డి నగర్లోని ఆడిటోరియంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
వనస్థలిపురం ప్రాంతంలో అవకాశం ఉన్న ప్రతి చోట అద్భుతమైన పార్కులను నిర్మించామన్నారు. ఇప్పుడు క్రీడా స్థలాలపై దృష్టి పెట్టామని చెప్పారు. సుష్మ థియేటర్ వెనుక, గాయత్రీ భవన్ ప్రాంగణం, డిపిఎస్ గ్రౌండ్లను అద్భుతమైన క్రీడా ప్రాంగణాలుగా తీర్చిదిద్దబోతున్నామన్నారు. కొన్నిచోట్ల స్థానికులు అభ్యంతరం చెబుతున్నారని అది సరికాదని తెలిపారు. క్రీడా మైదానాల ద్వారా మన పిల్లల ప్రతిభ బయటకు వస్తుందని, వారు శారీరకంగా, మానసికంగా దృఢంగా తయారవుతారన్నారు.
భవిష్యత్తు తరాలను దృష్టిలో ఉంచుకొని పార్కులు క్రీడాస్థలాలను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలో వందల కోట్లతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. 118 జీవోను తీసుకువచ్చి బీఎన్ రెడ్డి నగర్ డివిజన్లో రిజిస్ట్రేషన్ల సమస్య పరిష్కరించామన్నారు. సగానికి పైగా బాధితులకు కన్వీనియన్స్ డీడ్లు ఇప్పించామన్నారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 118 జీవోకి కొర్రీలు పెడుతుందని విమర్శించారు. కాంగ్రెస్ నాయకులు జీవో అమలు కాకుండా అడ్డుపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరి బాధితుడు వరకు న్యాయం చేసేదాకా వదిలేది లేదని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు కటికరెడ్డి అరవింద్ రెడ్డి, అనిల్ చౌదరి, సుమన్ గౌడ్, గంగం శివశంకర్, కాజా శ్రీనివాస్, కాలనీ సంక్షేమ సంఘాల నాయకులు పాల్గొన్నారు.