మేడ్చల్, మే 28 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ సభ్యత్వ నమోదుకు సమయత్తమవుతున్నది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా సభ్యత్వ నమోదుపై విస్తృత స్థాయి సమావేశాలు జరుగుతున్నాయి. బీఆర్ఎస్ సభ్యత్వ నమోదును విజయవంతం చేసేలా సిద్ధం చేసిన ప్రణాళికలను అమలు చేసేలా.. త్వరలోనే ప్రతి పోలింగ్ కేంద్రానికి ఇద్దరు కార్యకర్తలను ఎంపిక చేసి శిక్షణ ఇవ్వనున్నారు.
ఇప్పటికే జిల్లాలోని మేడ్చల్, మల్కాజిగిరి, ఉప్పల్, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల్లో పోలింగ్ కేంద్రాల్లో ఇద్దరు కార్యకర్తలను ఎంపిక చేసేలా కసరత్తు చేస్తున్నారు. డిజిటల్ సభ్యత్వ నమోదుకు సంబంధించి యాప్‌ను సిద్ధం చేయగా పోలింగ్ కేంద్రాలకు ఇద్దరు చొప్పున ఎంపిక చేసిన కార్యకర్తలకు శిక్షణ పూర్తయిన వెంటనే డిజిటల్ సభ్యత్వ నమోదును ప్రారంభించనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణులు పార్టీ నిర్వహించే ఆందోళన కార్యక్రమాలకు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు.
గతంలో చేపట్టిన సభ్యత్వాల నమోదును రికార్డు స్థాయిలో జరగగా, ప్రస్తుతం డిజిటల్ యాప్‌లో సభ్యత్వ నమోదు చేయడంపై శిక్షణ అనంతరం తేదీని బీఆర్ఎస్ అధిష్టానం నిర్వహించనున్నది. ప్రణాళిక సిద్ధం.. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో సభ్యత్వ నమోదుకు ప్రణాళికను సిద్ధం చేశారు. ఇప్పటికే బీఆర్ఎస్అ ధిష్టానం ఐదు నియోజకవర్గాలకు సంబంధించి మేడ్చల్ నియోజకవర్గానికి రాగిడి లక్ష్మారెడ్డి, మల్కాజిగిరి నియోజకవర్గానికి నందికంటి శ్రీధర్, కూకట్పల్లి నియోజకవర్గానికి గజ్జెల నాగేశ్, కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి నవీన్‌రావు, ఉప్పల్ నియోజకవర్గానికి గొంగిడి మహేందర్రెడ్డిలను నియమించిన విషయం తెలిసిందే. ఒక్కో నియోజకవర్గంలో లక్షకు పైగా సభ్యత్వ నమోదు చేసే విధంగా నియోజకవర్గాల్లో కార్యకర్తలు, నాయకులతో విస్తృతస్థాయి సమావేశాలను నిర్వహిస్తున్నారు.
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ పటిష్టంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికి జిల్లాలో ఐదు నియోజకవర్గాలలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న నేపథ్యంలో పార్టీ బలంగా ఉంది. పార్టీలోని కేడర్ చెక్కు చెదరకుండా ఉండటంతో బీఆర్ఎస్ సభ్యత్వ నమోదును లక్ష్యానికి మించి చేయాలన్న ఉత్సాహంతో బీఆర్ఎస్ శ్రేణులు ఉన్నారు. సభ్యత్వ నమోదును విజయవంతం చేసి త్వరలోనే రానున్న ఎంఎంసీ, సీఎంసీ కార్పొరేషన్లలో సత్తా చాటాలనే విధంగా బీఆర్ఎస్ శ్రేణులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడిన దృష్ట్యా కాంగ్రెస్ పార్టీకి ఎంఎంసీ, సీఎంసీ ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చేలా బీఆర్ఎస్ శ్రేణులు సన్నద్ధమవుతున్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో ఇటీవలే కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరుతున్న విషయం తెలిసిందే.