సిటీబ్యూరో, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ) : హైదర్షాకోట్లోని మూసీ బాధితులను మాజీ హోం మంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్యేలు సబితా ఇంద్రా రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్, బీఆర్ఎస్ నాయకులు కార్తీక్ రెడ్డితో కలిసి గురువారం పరామర్శించారు. బాధితుల ఇళ్లు కూల్చివేయకుండా అడ్డుకుంటామని, బుల్డోజర్లు, జేసీబీలు ఎన్నొచ్చినా తమను దాటుకొని వెళ్లాలన్నారు.
బాధితులందరూ ధైర్యంగా ఉండాలని, ఆత్మవిశ్వాసం కోల్పోవద్దని, హైడ్రా పుణ్యమా అని ఇప్పటికే ముగ్గురు ప్రాణాలు కోల్పోయారని, అలాంటి పరిస్థితి రాకుండా తాము వారికి అండగా ఉంటామని భరోసానిచ్చారు. ఇందిరమ్మ పాలన అంటే పేదలకు కూడు, గూడు ఇచ్చేదని, కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన మాత్రం పేదల బతుకులను కూల్చివేసే ప్రయత్నం చేస్తున్నదని సీఎం రేవంత్ రెడ్డి పనితీరుపై మండిపడ్డారు. అవసరమైతే మూసీ తీరంలో ఏరియాకు ఒక ఎమ్మెల్యే ఉండి వారి ఇండ్లను కూల్చివేయకుండా కాపాడుతామని బాధితులకు హామీ ఇచ్చారు.