shivarampally | మైలార్‌దేవ్‌పల్లి, మే 25: రాకపోకలకు ఇబ్బంది కలిగేలా ప్రహారీ గోడను నిర్మించి ప్రజలను అవస్థలకు గురి చేస్తున్నారని మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎస్.వెంకటేశ్ అన్నారు. శుభోదయం మైలార్‌దేవ్‌పల్లి కార్యక్రమంలో భాగంగా శివరాంపల్లి రైల్వే స్టేషన్ వద్ద బాబుల్‌రెడ్డి నగర్ వాసులు, బీఆర్ఎస్ నాయకులు ఆందోళనకు దిగారు. రైల్వే గేటుకు అడ్డంగా కూర్చొని ప్రహారీ గోడను తొలగించాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా ఎస్.వెంకటేశ్ మాట్లాడుతూ.. బాబుల్‌రెడ్డినగర్ తదితర ప్రాంతాలకు చెందిన ప్రజలు అనేక మంది ఈ దారినే ఉపయోగిస్తుంటారని తెలిపారు. స్కూళ్లు, కాలేజీలు, ఆఫీసులకు ఈ దారి నుంచే వెళ్తుంటారని.. ఇప్పుడు గోడ కట్టడం వల్ల పిల్లలు, మహిళలు, రోగులు రోడ్డు దాటడానికి ఇబ్బందిగా మారిందని పేర్కొన్నారు. బాబుల్‌రెడ్డి నగర్‌లోని పిల్లలు స్కూళ్లకు వెళ్లాలంటే మూడు కిలోమీటర్ల తిరిగి వెళ్లాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై స్థానిక ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్, కార్పొరేటర్ తోకల శ్రీనివాస్ రెడ్డికి పలుమార్లు వినతి పత్రాలు సమర్పించినప్పటికీ పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులు, అధికారులంతా కలిసి ప్రజల సమస్యలను గాలికి వదిలేస్తున్నారని.. అందుకే స్థానిక ప్రజలతో కలిసి బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులం ఆందోళనకు దిగామన్నారు.
ఈ ప్రహారీ గోడ వల్ల ఎవరికీ లాభం లేదని ఎస్.వెంకటేశ్ తెలిపారు. అధికారులు అత్యుత్సాహంతో ఈ గోడను నిర్మించారని పేర్కొన్నారు. అధికారులు వెంటనే స్పందించి ఈ గోడను కూల్చివేసి, గతంలో మాదిరి ప్రజలకు రాకపోకలు కల్పించాలని కోరారు. లేనిపక్షంలో రానున్న రోజుల్లో భారీ ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు.