బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని కోరుతూ బీసీ సంఘాలిచ్చిన తెలంగాణ బంద్ గ్రేటర్ వ్యాప్తంగా విజయవంతమైంది. బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతుతో బీసీ జేఏసీ పిలుపునకు సబ్బండ వర్గాల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. శనివారం ఉదయం నుంచే రోడ్డెక్కిన నాయకులతో నగర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. కొన్ని చోట్ల అడపాదడపా ఘటనలు జరిగాయి. ఇక ప్రైవేటు బ్యాంకులు, సంస్థలు బంద్‌కు సంఘీభావంగా నిలువగా, బంద్ ఫర్ జస్టిస్‌కు అన్ని వర్గాలు స్వచ్ఛందంగా సహకరించాయి.
– సిటీబ్యూరో, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ)
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ బంద్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించడంతో ఉదయం నుంచే బీఆర్ఎస్ గ్రేటర్ నేతలు ఉత్సాహంతో ముందుకు కదిలారు. రాజ్యాంగ సవరణతోనే బీసీ రిజర్వేషన్ల అమలు సాధ్యం అని తెలిసినా.. కాంగ్రెస్ పార్టీ బీసీలతో ఆడుతున్న చెలగాటానికి నిదర్శనమే అంటూ బీసీ జేఏసీకి సంపూర్ణ మద్దతుగా నిలిచారు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్, శ్రీనివాస్ గౌడ్, మండలి ప్రతిపక్షనేత మధుసూదనాచారి, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర బీఆర్ఎస్ పార్టీకి చెందిన బీసీ నేతలు తెలంగాణ భవన్లో సమావేశమై అక్కడి నుంచి ర్యాలీగా ఆర్టీసీ క్రాస్ రోడ్డుకు చేరుకున్నారు. తెల్లవారు జాము నుంచే బస్ డిపోల వద్దకు నాయకులు చేరుకున్నారు.
హైదరాబాద్‌లోని ఎంజీబీఎస్ స్టేషన్ వద్ద బీసీల ధూంధాంను బీసీ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించగా.. దాదాపు 12గంటల పాటు రిజర్వేషన్ల సాధన కోసం బైఠాయించారు. రాష్ట్ర బంద్ ఒక శాంపిల్ మాత్రమేనని, మున్ముందు బీసీల తడాఖా చూపిస్తామన్నారు. బీసీ బంద్‌తోనైనా కేంద్ర, రాష్ట్ర సర్కార్ కళ్లు తెరవాలన్నారు. పార్టీలు ఒకరి ఒకరు ఆరోపణలు చేసుకోవడం కంటే బీసీ రిజర్వేషన్ల కోసం చిత్తశుద్ధితో పాటు పడాలని బీసీ జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. ఆర్టీసీ క్రాస్ రోడ్డు రహదారిపై బైఠాయించిన నేతలు పెద్ద ఎత్తున నినాదాలు చేయగా కార్యక్రమానికి సంఘీభావంగా ముషీరాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే ముఠా గోపాల్, మాజీ ఎమ్మెల్యేలు వినయ్ భాస్కర్‌తోపాటు పలువురు నాయకులు ర్యాలీలో పాల్గొన్నారు. బీసీలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మభ్యపెడుతున్నాయని మండిపడ్డారు.
కామారెడ్డి డిక్లరేషన్ పేరిట కాంగ్రెస్ సర్కారు బూటకానికి తెరలేపిందన్నా నాయకులు కాంగ్రెస్, బీజేపీలు మొక్కుబడిగా భాగస్వామ్యం అవుతున్నాయన్నారు. బీసీ రిజర్వేషన్లు తగ్గిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ఇదే స్ఫూర్తిగా బీసీ రథయాత్రను అన్ని జిల్లాల నుంచి ప్రారంభిస్తామని జేఏసీ నేతలు స్పష్టం చేశారు. బీసీ రిజర్వేషన్లతో రాజ్యాంగ హక్కుల సాధన కోసం సాగుతున్న పోరాటం కవులు, కళాకారులు, రచయితలు, సాహితీ సంఘాల నేతలు మద్దతుగా నిలిచారు. అన్ని ప్రజాస్వామిక ఉద్యమాల మాదిరిగానే బీసీల ఆర్థిక, రాజకీయ సామాజిక,న్యాయాల కోసం సాహిత్య లోకం అండగా ఉంటుందని, నగరంలోని ఎమ్మెల్యే క్వార్టర్లో జరిగిన సమావేశంలో మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రీ భాయి పూలే విగ్రహాలకు నివాళులర్పించారు.
కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్, గోవర్ధన్‌రెడ్డి, ఎంఎన్ శ్రీనివాస్‌రావు, బీఆర్ఎస్ యువ నాయకుడు ముఠా జయసింహ, బీఆర్ఎస్ పార్టీకి చెందిన బీసీ నేతలు గెల్లు శ్రీనివాస్ యాదవ్, ఆంజనేయులు గౌడ్, తుల ఉమ, దుద్దిమెట్ల బాలరాజ్ యాద్, పల్లె రవి, శ్రీనివాస్ యాదవ్,తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్, తెలంగాణ సాహితీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఆనందచారి, అభ్యుదయ రచయితలు, పరస, తెలంగాణ బుక్ ట్రస్ట్ నిర్వాహకులు పాల్గొన్నారు. ఇక శివారులో ఉన్న ప్రధాన కూడళ్ల వద్ద కూడా జేఎసీ ఆధ్వర్యంలో నిర్వహించిన బంద్‌లో అన్ని పార్టీల నేతలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు.