బంజారాహిల్స్, వెంగళరావునగర్, అక్టోబర్ 16: పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అభివృద్ధి జరగలేదంటూ కాంగ్రెస్ నేతలు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని బీఆర్ఎస్ నేతలు వినూత్న శైలిలో తిప్పికొడుతున్నారు. ఎమ్మెల్యే మాగంటి హయాంలో జూబ్లీహిల్స్‌లో జరిగిన అభివృద్ధి పనులను ఇన్చార్జిలుగా వచ్చిన బీఆర్ఎస్ నేతలు సోషల్‌మీడియా ద్వారా స్థానికులకు వివరిస్తున్నారు. వెంగళ్రావునగర్ డివిజన్ ఎన్నికల ప్రచారం కోసం వచ్చిన కోరుట్ల ఎమ్మెల్యే డా.కే.సంజయ్, రహ్మత్‌నగర్ డివిజన్ ఎన్నికల ప్రచారానికి వచ్చిన మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ గురువారం ఆయా ప్రాంతాల్లో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ హయాంలో చేపట్టిన పనులవద్దకు వెళ్లి లైవ్‌లో సోషల్‌మీడియా ద్వారా ప్రజలకు వివరిస్తున్నారు.
టిమ్స్ కనిపించడం లేదా..?
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని వెంగళ్రావునగర్ డివిజన్లోని ఛాతీ ఆస్పత్రి ఆవరణలో రూ.వందల కోట్ల వ్యయంతో అప్పటి సీఎం కేసీఆర్ నాయకత్వంలో స్థానిక ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పట్టుబట్టి టిమ్స్ ఆస్పత్రి మంజూరు చేయించారని కోరుట్ల ఎమ్మెల్యే, వెంగళ్రావునగర్ డివిజన్ ఎన్నికల ఇన్చార్జి సంజయ్ తెలిపారు. కరోనా సమయంలో సుమారు రూ.400కోట్లతో వెంగళ్రావునగర్ డివిజన్ పరిధిలో టిమ్స్ ఆస్పత్రి కోసం భారీ నిర్మాణం ప్రారంభించారు. 90శాతం పనులు పూర్తవ్వగా అసెంబ్లీ ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మిగిలిన 10శాతం పనులు కూడా పూర్తిచేయలేకపోతోంది. ఇలాంటి అద్బుతమైన టిమ్స్ ఆస్పత్రి కాంగ్రెస్ నేతలకు కనిపించడం లేదా అని సంజయ్ ఎద్దేవా చేశారు.
దళిత్ స్టడీ సెంటర్ కనిపిస్తలేదా..?
దళిత విద్యార్థులకు అద్భుతమైన శిక్షణ ఇవ్వడంతో పాటు అనేక కార్యక్రమాల కోసం బీఆర్ఎస్ హయాంలో రహ్మత్‌నగర్ డివిజన్లో సుమారు రూ.30కోట్ల వ్యయంతో దళిత్ స్టడీ సెంటర్‌ను నిర్మించారని మాజీ చీఫ్ విప్, రహ్మత్‌నగర్ డివిజన్ ఇన్చార్జి వినయ్ భాస్కర్ తెలిపారు. అప్పటి ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ చొరవతో అత్యాధునిక హంగులతో దీన్ని కట్టారు. లైబ్రరీలు, కాన్ఫరెన్స్ హాల్స్, మీటింగ్ హాల్స్. డిజిటల్ లైబ్రరీలు, కంప్యూటర్ ల్యాబ్స్, భారీ ఆడిటోరియం సహా అనేక సౌకర్యాలు కల్పించారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దళిత్ స్టడీ సెంటర్‌ను ఉపయోగంలోకి తీసుకురాలేదు. బీఆర్ఎస్, మాగంటికి మంచిపేరు వస్తుందనే దళిత్ స్టడీ సెంటర్‌ను ప్రారంభించడం లేదని వినయ్ భాస్కర్ ఆరోపించారు.