సిటీ బ్యూరో, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ): నేరగాడిని తీసుకొచ్చి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెడితే నిరుద్యోగుల బాధలు ఎలా తెలుస్తాయని బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ప్రశ్నించారు. గ్రూప్-1 అభ్యర్థులకు సంఘీభావంగా శుక్రవారం ఆయన అశోక్ నగర్‌లోని సిటీ సెంట్రల్ లైబ్రరీని సందర్శించి పుస్తక పఠనం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి చదువకుంటే నిరుద్యోగుల ఇబ్బందులు అర్థమయ్యేవని ఎద్దేవా చేశారు. రకరకాల నేరాలకు పాల్పడ్డ వ్యక్తి నేడు హోం మంత్రి, ముఖ్యమంత్రిగా ఉండటం దౌర్భాగ్యమన్నారు.
ఏండ్ల తరబడిగా తల్లిదండ్రులకు దూరంగా ఉంటూ చదువుకుంటున్న నిరుద్యోగులను కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండ్లేండ్లవుతున్నా పాత నోటిఫికేషన్లతోనే ఉద్యోగాలను భర్తీ చేశారని విమర్శించారు. ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలని అశోక్ అనే వ్యక్తి ఐదు రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ ప్రాణాపాయస్థితిలో ఉన్నా మంత్రులు, సీఎం పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్యోగాల కోసం దీక్షలు చేయాల్సిన దుస్థితి ఏర్పడిందని అసహనం వ్యక్తం చేశారు. రోజుకు 16 గంటల చొప్పున ఏండ్ల తరబడిగా చదువుతున్న నిరుద్యోగుల బాధ రేవంత్‌రెడ్డికి ఎందుకు అర్థం కావడం లేదని ప్రశ్నించారు.
ఒకసారి హైదరాబాద్ సిటీ సెంట్రల్ లైబర్రీకి వచ్చి చూస్తే తెలుస్తుందన్నారు. తాను కూడా లైబ్రరీల్లో చదువుకునే ఈ స్థాయికి వచ్చానని, నిరుద్యోగుల బాధలు తనకు తెలుసన్నారు. రాష్ట్రంలో ఉద్యోగాల కోసం దాదాపు 35 లక్షల మంది నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారని తెలిపారు. నిరుద్యోగుల విషయంలో రాజకీయాలు చేయకుండా ఉద్యోగాలివ్వాలని కోరారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టినట్లుగా 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వాల్సిందేనని అన్నారు. దసరాలోగా కనీసం 50 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
సిటీ సెంట్రల్ లైబ్రరీకి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ వస్తున్నారని తెలియగానే వందలాది మంది పోలీసులు ఆ పరిసరాలను మోహరించారు. దాదాపు పది పోలీసు వ్యాన్లను లైబర్రీ ప్రాంగణంలో నిలిపారు. లైబ్రరీ వద్దకు రాగానే ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. లోపలికి వెళ్లేందుకు అనుమతి లేదంటూ బయటనే నిలిపేశారు. పుస్తకాలు చదవటానికి వెళ్తుంటే ఎందుకు అడ్డుకుంటున్నారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు.
బీఆర్ఎస్ నాయకులు ప్రజల మధ్యకు వస్తుంటే ఎందుకు భయపడుతున్నారంటూ నిలదీశారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన పోరాడుతుందన్నారు. పోరాటం బీఆర్ఎస్ పార్టీ సిద్ధాంతంలోనే ఉందని స్పష్టం చేశారు. దీంతో పోలీసులు ఆయనతో వాగ్వాదానికి దిగారు. కాసేపటి తర్వాత అనుమతించడంతో ఆయన లోపలికి వెళ్లి గంటకు పైగా పుసక్త పఠనం చేశారు.