అల్లాపూర్, అక్టోబర్ 29: ‘జూబ్లీహిల్స్ మీ అయ్యజాగీరా.. పోలీసులను అడ్డం పెట్టుకుని బీఆర్ఎస్ నాయకులపై తప్పుడు కేసులు బనాయిస్తారా..’ అంటూ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ పై బీఆర్ఎస్ సీనియర్ నేత డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బుధవారం ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాన్ని సైతం లెక్కచేయకుండా బీఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ‘జ్లూబ్లీహిల్స్ నా అడ్డా, ఇది దాటి బయటకు పోలేరు, ఏం తమాషాలు చేస్తున్నారా..’ అని ఇటీవల నవీన్ యాదవ్ బీఆర్ఎస్ నాయకులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల పై ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఫైరయ్యారు. నవంబర్ 11న జరిగే ఉప ఎన్నికలో కారు గుర్తుకు ఓటేసి మాగంటి సునీతా గోపీనాథ్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.
కళారంగాన్ని నమ్ముకుని జీవనం సాగిస్తున్న సినీ కార్మికులు రేవంత్‌రెడ్డి లాంటి ఫేక్ ఆర్టిస్టుల మాటలు నమ్మొద్దని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎక్స్ వేదికగా విన్నవించారు. సినీ కార్మికుల సన్మాన సభలో సీఎం రేవంత్‌రెడ్డి ఒక ఫేక్ ఆర్టిస్టులా ప్రసంగించారని మండిపడ్డారు. తన సొంత నియోజకవర్గం కొడంగల్‌లో యంగ్ ఇండియా పేరుతో స్కూల్ కట్టడానికి గుంత తీసి ఒక్క ఇటుక కూడా పెట్టని రేవంత్ సినీ కార్మికుల కోసం ఇళ్ల స్థలాలు ఇస్తానని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. సినీ కార్మికులకు ఇచ్చిన వాగ్దానాలన్నీ ఓ ఎలక్షన్ స్టంట్ అని ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ విమర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డి మాటలు నమ్మి మోసపోవద్దని జాగ్రత్తగా ఉండాలని కార్మికులను కోరారు.