మైలార్‌దేవ్‌పల్లి, జూన్ 26 : తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులందరికి రైతు బంధు పథకాన్ని అమలు చేయాలని పక్షపాతం వీడాలని రాజేంద్రనగర్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జీ పట్లోళ్ల కార్తీక్‌రెడ్డి అన్నారు. ఆయన అధ్యక్షతన తెలంగాణ భవన్లో గురువారం నిర్వహించిన సమావేశంలో మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షులు ఎస్.వెంకటేష్, గెల్లు శ్రీనివాస్, నోముల రాముయాదవ్లు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కార్తీక్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో రైతుబంధు వేసి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం, శంషాబాద్ మండలాలతో పాటు ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న వ్యవసాయ భూములు ఉన్న రైతులకు ఎందుకు రైతు బంధు వేయలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగిందన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న వ్యవసాయ రైతులకు 12 గంటల లోపల రైతుబంధు వేయకుంటే రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా చేస్తామని హెచ్చరించామన్నారు. దీనికి కాంగ్రెస్ సర్కార్ దిగి వచ్చి 12 గంటలలోపు 50 శాతం రైతులకు రైతు బంధు వేయడం జరిగిందన్నారు. మిగతా వారికి కూడా రైతు బంధు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా అయితే వేసిందో అదే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రైతు బంధు వేయాలన్నారు. లేకుంటే త్వరలోనే రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ముందు నిరాహార దీక్ష చేపడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.