Muta Jayasimha | కవాడిగూడ, మార్చి 8 : మహిళా సాధికారతకు కేసీఆర్ నేతృత్వంలోని గత బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేసిందని యువ నాయకుడు ముఠా జయసింహ అన్నారు. కవాడిగూడ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ యువ నాయకుడు ముఠా జయసింహ ముఖ్య అతిథిగా పాల్గొని కేక్ కట్‌చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ మహిళా కార్యకర్తలు మాధవి, రూప, యశోధ, విజయలక్ష్మి, మంజుల, రఫియాబాణులను ఘనంగా సన్మానించి వారికి మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. మహిళల సంక్షేమమే ధ్యేయంగా అనేక పథకాలను ప్రవేశపెట్టి నిరాటంకంగా అమలు చేసిన ఘనత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కిందన్నారు. సమాజ నిర్మాణంలో మహిళల పాత్ర అమోఘమైందన్నారు. ప్రస్తుత తరుణంలో కుటుంబం నుంచి మొదలుపెడితే దేశ నిర్మాణం వరకు ప్రతి రంగంలో మహిళా శక్తి సత్తా చాటుతుందన్నారు. బీఆర్ఎస్ పార్టీ కవాడిగూడ డివిజన్ అధ్యక్షుడు వల్లాల శ్యామ్యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు సాయికృష్ణ, చిత్రాలనగర్ శ్రీహరి, రాంచందర్, రాజశేఖర్‌గౌడ్, రవియాదవ్ తదితరులు పాల్గొన్నారు.