Hyderabad | ఎర్రగడ్డ, జూన్ 29 : కాంగ్రెస్ కార్పొరేటర్ ఒత్తిళ్లకు తలొగ్గిన బల్దియా టౌన్ ప్లానింగ్ అధికారులు ఓ దళితుడి ఇంటికి తాళాలు వేసి సీజ్ చేశారు. దీంతో కోర్టును ఆశ్రయించాడు బాధితుడు. సదరు ఇంటికి వేసిన సీజ్‌ను తొలగించాలని కోర్టు నుంచి ఉత్తర్వులు వచ్చాయి. కానీ అధికారులు ఆ ఉత్తర్వులను పట్టించుకోవటం లేదు. ఫలితంగా బాధిత దళిత కుటుంబం గత 2 నెలలుగా ఉండటానికి ఇల్లు లేక వీధిన పడింది. బోరబండ డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు కృష్ణమోహన్ ధీన పరిస్థితి ఇది.
2 నెలలుగా అవస్థలు..
కృష్ణమోహన్‌కు బోరబండ డివిజన్ వినాయకరావు నగర్లో 75 గజాల స్థలంలో చిన్న ఇల్లు ఉంది. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉన్న ఆయన అప్పు చేసి ఇంటి పునర్నిర్మాణాన్ని చేపట్టాడు. కాంగ్రెస్ వాళ్ళ కళ్లు మండాయి. కాంగ్రెస్ పార్టీలో చేరాలని డివిజన్ కాంగ్రెస్ కార్పొరేటర్.. కృష్ణమోహన్‌పై ఒత్తిడి తెచ్చాడు. ఒత్తిళ్లకు తలొగ్గని మోహన్ పై కసి పెంచుకున్న కార్పొరేటర్ బల్దియా అధికారులను పావులుగా వాడుకున్నాడు. నిర్మాణంలో ఉన్న మోహన్ ఇంటికి వచ్చిన అధికారులు రెండు ఫ్లోర్ లను పాక్షికంగా ధ్వంసం చేశారు. సరిగ్గా 2 నెలల క్రితం ముందస్తు నోటీసు ఇవ్వకుండా ఆ ఇంటి గేటుకు తాళాలు వేసి సీజ్ చేశారు. దీంతో బాధితుడు హైకోర్టును ఆశ్రయించాడు. ఆ ఇంటికి వేసిన సీజ్ ను తొలగించాలని ఈ నెల 18న కోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు తన ఇంటికి వేసిన తాళాలు, సీజ్‌ను తొలగించాలని కోరుతూ బల్దియా టౌన్ ప్లానింగ్ అధికారులను విన్నవించాడు. కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తున్న అధికారులు ఆ విషయానికి ప్రాధాన్యత ఇవ్వకపోవడం గమనార్హం. దీంతో నిరాశకు గురైన కృష్ణమోహన్ గత 10 రోజులుగా తన కుటుంబంతో రోజు తన ఇంటి ముందు కూర్చుని గేటు తాళాల తొలగింపు కోసం ఎదురు చూస్తున్నాడు.
అధికారుల వైఖరిపై అనుమానాలు..
కోర్టు ఆదేశాలను బేఖాతరు చేయటం.. ఇంటి గేటుకు వేసిన తాళాలు, సీజ్‌ను తొలగించక పోవటంతో అధికారులపై అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. కాంగ్రెస్ కార్పొరేటర్ కనుసన్నల్లో పని చేస్తున్న అధికారులు తమ వృత్తి ధర్మాన్ని పక్కన పెట్టారనటంలో సందేహం లేదు. ఉండటానికి ఇల్లు లేక గత 2 నెలలుగా తాము పడుతున్న పాట్లు అంతా ఇంతా కాదని బాధితుడైన కృష్ణమోహన్ ఆవేదన వ్యక్తం చేశాడు.