LB Nagar | మన్సురాబాద్, మార్చి 18 : ప్రజలు తిరగబడతారన్న భయంతోనే కాలనీలకు ఒంటరిగా వెళ్లలేక పోలీసుల పహారాలో బిజెపి కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి శంకుస్థాపనలు చేస్తున్నాడని ఎల్బీనగర్ నియోజకవర్గం బిఆర్ఎస్ నాయకుడు జక్కిడి రఘువీర్ రెడ్డి ఆరోపించారు.
మన్సురాబాద్ డివిజన్ సెంట్రల్ బ్యాంక్ కాలనీలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈనెల 12న ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి శంకుస్థాపనలు చేసిన అభివృద్ధి పనులను తిరిగి మళ్లీ శంకుస్థాపనలు చేసేందుకు వచ్చిన కార్పొరేటర్ ని ప్రశ్నించేందుకు వెళ్లిన బీఆర్ఎస్ కార్యకర్తలను గంజాయి బ్యాచులంటూ ఆరోపణలు చేశాడన్నారు. గంజాయి బ్యాచులు, బ్రోతల్ హౌస్ నిర్వాహకులు, గ్యాంబ్లింగ్ ఆట నిర్వాహకులంతా బిజెపి కార్పొరేటర్ ప్రధాన అనుచరులేనన్న విషయం ఆయన గుర్తుంచుకొని మాట్లాడితే బాగుంటుందని తెలిపారు. కార్పొరేటర్ అనుచరులపైనే ఇలాంటి కేసులు ఉన్నాయని త్వరలో వాటన్నిటి ఆధారాలను బయటపెడతామని హెచ్చరించారు.
ఇంటిముందు ఇటుక, ఇసుక పడితే ప్రజలను పీడించుకుతింటున్న కార్పోరేటర్ పిఏల బాగోతాన్ని త్వరలో బయటపెడతానన్నారు. శంకుస్థాపనలు చేసిన పనులకు తిరిగి శంకుస్థాపనలు చేసేందుకు వచ్చిన వారిలో మన్సురాబాద్ డివిజన్‌కు చెందిన బిఆర్ఎస్ కార్యకర్తలు మాత్రమే ఉన్నారని.. అదే కార్పొరేటర్ 10 సంవత్సరాల క్రితం నుంచి తన వద్ద పనిచేసి మానేసిన డ్రైవర్లను పిలిపించుకున్నాడని ఆరోపించారు. ప్రజాబలం, కార్యకర్తల బలం లేకనే రౌడీమూకలను, అడ్డమీద కూలీలను పిలిపించుకొని డివిజన్లో కుటిల రాజకీయాలకు పాల్పడుతున్నాడని ఆరోపించాడు.
పోలీసు పహారాల్లో తిరిగే కార్పొరేటర్ ప్రజలకు ఏమి న్యాయం చేస్తాడని ప్రశ్నించాడు. కార్పొరేటర్ నరసింహారెడ్డి కాలం చెల్లి పోయిందని మూడు నెలల్లో పదవి ఊడుతుందన్నారు. బిజెపి పార్టీ నుంచి కార్పొరేటర్ గా గెలిచిన కొప్పుల నరసింహారెడ్డి కాంగ్రెస్ పార్టీతో కుమ్ముక్కై చేస్తున్న రాజకీయాలు ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. పొద్దున బిజెపి కండువా వేసుకొని తిరిగే నీవు సాయంత్రం అయితే కాంగ్రెస్ పార్టీ నేత మధుయాష్కీ గౌడ్ ఇంటికి వెళ్లి మంతనాలు సాగిస్తున్నది వాస్తవం కాదా అని ఆయన ప్రశ్నించారు. మనసురాబాద్ లో బిజెపిని బొంద పెట్టి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి రంగం సిద్ధం చేసుకున్నాడని ఆరోపించారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలో మధుయాష్కి టూరిస్టుల తయారయ్యాడని, నియోజకవర్గం అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీకి ఆయన చేసింది ఏమీ లేదంటూ ఎద్దేవా చేశారు. చిన్న చెరువు తాము కబ్జా చేశామని మధుయాష్కీ ఆరోపణలు చేశాడని.. ఈ విషయంపై ఎలాంటి విచారణకైనా సిద్ధమేననీ.. సర్వేనెంబర్ 93తో పాటు, చిన్న చెరువు పరిసరాల్లోని భూములపైన సర్వే చేయించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు సతీష్ కుమార్, రామాచారి, అఖిల్ యాదవ్, నరి లింగం, సాయి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.