Sri Rama Navami | చంపాపేట, ఏప్రిల్ 06 : చంపాపేట డివిజన్ పరిధిలో శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కర్మన్‌ఘాట్‌లోని శ్రీ ధ్యానాంజనేయ స్వామి దేవాలయ ప్రాంగణంలో, అదే విధంగా అంజిరెడ్డి కాలనీ పార్క్‌లో ఆలయ కార్యనిర్వహణాధికారి ఎన్ లావణ్య పర్యవేక్షణలో ఆదివారం శ్రీ సీతారాముల కల్యాణం కన్నులపండువగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి కమల దంపతులు స్వామివారికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. భారీ ఊరేగింపు మధ్య స్వామి వారి పట్టు వస్త్రాలు, తలంబ్రాలను ఎమ్మెల్యే దంపతులు కల్యాణ మండపానికి తీసుకొచ్చారు. ఎమ్మెల్యే దంపతులు అంతకుముందు ధ్యానాంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి కల్యాణంలో పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే దంపతులకు వేదపండితులు స్వామివారి శేష వస్త్రాలు, తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు.