Police Stations | సిటీబ్యూరో: పోలీస్ ఠాణాలకు నెలవారీ ఖర్చులకు ప్రభుత్వం అందించే నిధులకు బ్రేక్ పడుతున్నది. దీంతో చాలా పోలీస్స్టేషన్లలో అవినీతి, అక్రమాలు పెరుగుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. నెలవారీ మామూళ్లు వసూలు చేయడం, ఫిర్యాదుదారులు, నిందితుల వద్ద ఖర్చులకంటూ వసూలు చేస్తూ.. నిధులు రాకపోవడాన్ని కారణంగా చూపిస్తూ.. అవినీతికి ఆజ్యం పోస్తున్నారనే విమర్శలొస్తున్నాయి. కొన్ని పోలీస్స్టేషన్లకు మూడు నాలుగు నెలలుగా నిధులు రావడం లేదని పోలీసు వర్గాల్లో చర్చనడుస్తున్నది.
కొందరు ఇన్స్పెక్టర్లు ఇదే అదనుగా ఒకేసారి మూడు నాలుగు నెలలకు పోలీస్‌స్టేషన్‌కు వచ్చే నిధులను ప్రభుత్వం విడుదల చేసిందంటే.. ఆ డబ్బులను నేరుగా వెనకేసుకునే పనిలో ఉన్నారన్న ఆరోపణలున్నాయి. ఇలా ఠాణా నిర్వహణకు వచ్చే ఖర్చుల పంపకాల్లో ఎస్హెచ్ఓ, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ (డీఐ)ల మధ్య తగాదాలు కూడా చోటు చేసుకుంటున్నట్లు తెలిసింది. ట్రై పోలీస్ కమిషనరేట్ పరిధిలోని చాలా ఠాణాల్లో ఈ వ్యవహారం కొనసాగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.
ఠాణాలకు వచ్చే ప్రజల నుంచి ఒక పైసా కూడా తీసుకోవద్దని, నెలవారీ మామూళ్లు వసూలు చేయవద్దని, గత బీఆర్ఎస్ ప్రభుత్వం..2015లో పోలీస్స్టేషన్లలో ఖర్చులకు నిధులు మంజూరు చేసింది. పీఎస్‌లను ఏ,బీ,సీ విభాగాలు చేసి ప్రధాన నగరాల్లో ఉన్న ఠాణాలను ఏ గ్రేడ్ కింద నెలకు రూ. 75 వేలు, ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌కు రూ. 25 వేల చొప్పున నిధులను కేటాయించింది.
వీటిని పోలీస్‌స్టేషన్‌కు వచ్చే వారికి అవసరమైతే మంచినీళ్లు, టీ ఇవ్వడంతో పాటు కేసుల ఇతరాత్ర అయ్యే టీ ఖర్చుతో పాటు స్టేషనరీ, ట్రాన్స్‌పోర్టు, రవాణా ఖర్చులు, సిబ్బంది భోజనం వంటి వాటికి ఖర్చుపెట్టాలని సూచించింది. కేసుల దర్యాప్తునకు అయ్యే ఖర్చులు పూర్తిగా పోలీసులే భరించాలని, తద్వా రా పోలీసులు చెయ్యి చాచి ఎవరినీ డబ్బులు అడిగే పరిస్థితి ఉండవద్దని, మామూళ్లు అనేవి ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండవద్దని బీఆర్ఎస్ ప్రభుత్వం పోలీసు శాఖపై ఉన్న అవినీతి మరకను తుడి చేసింది. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత నిధులు సరైన సమయానికి పోలీసులకు అందించకపోవడంతో చాలా పోలీస్స్టేషన్లు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నట్లే తిరిగి మామూళ్ల దందా.. ఠాణాకు వచ్చే ఫిర్యాదుదారులు, నిందితుల నుంచే ఖర్చులకు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.
ప్రతి నెలా స్టేషనరీ, ట్రావెల్, భోజనాల ఖర్చులు ఇలా అన్ని బిల్లులు తయారు చేసే స్టేషన్ రైటర్ లేదా అకౌంటెంట్ ద్వారా ఆ బిల్లులను కమిషనరేట్ కార్యాలయానికి పంపిస్తే.. అక్కడి నుంచి పేఅండ్ అకౌంట్స్ విభాగానికి వెళ్తాయి.. ఆ తరువాత అక్కడి నుంచి ఆయా ఠాణాలకు చెక్కులు జారీ అవుతుంటాయి. చాలా మంది ఇన్స్పెక్టర్లు ఈ బిల్లులను డమ్మీవి పెడుతున్నట్లు ఆరోపణలున్నాయి. గతంలో ఈ ఆరోపణలు రావడంతో ఉన్నతాధికారులు సైతం ఈ విషయంపై లోతుగా దర్యాప్తు జరిపినట్లు సమాచారం.
తన స్టేషన్ పరిధిలో ఉండే దుకాణాలు, ఇతర ప్రాంతాల్లో ఉన్న హోటల్స్, ట్రావెల్స్, స్టేషనరీల నుంచి కావాల్సిన బిల్లులు తీసుకుంటూ.. వాటినే ఠాణాకు ఖర్చు చేసిన వివిధ బిల్లులుగా పొందుపరుస్తున్నారనే ఆరోపణలున్నాయి. అయితే కొన్ని సందర్భాల్లో బిల్లులు పెట్టినా.. మూడు నాలుగు నెలలకోసారి నిధులు మంజూరవుతుండటంతో నెలవారీగా ఆయా ఠాణాల పరిధిలో మామూళ్లు వసూలు చేయడం, కావాల్సిన పనులు ఠాణా పరిధిలో ఉండే ఆయా వ్యక్తులతో ఎస్హెచ్ఓలు చేయించుకుంటున్నారని, ఆ పనిని ఉచితంగా చేయించుకొని.. తాము సొంతంగా డబ్బులు పెట్టామంటూ అందుకు సంబంధించిన బిల్లులు డమ్మీవి తెచ్చి వాటినే పైకి పంపిస్తున్నట్లు సమాచారం.
ముందుగా ఖర్చుపెట్టి ఆ బిల్లులనే మేం పెడుతున్నామని.. ఎవరికీ వాటాలు ఇచ్చేది లేదంటూ కొందరు ఇన్స్పెక్టర్లు డీఐలు, ఎస్సైలకు తేల్చి చెబుతున్నట్లు ఆరోపణలున్నాయి. ఆయా కేసుల్లో ఏమై నా ఖర్చులు ఉంటే ఎవరి కేసుకు సంబంధించి వారే వెచ్చిస్తుంటారు. అయితే కొందరు ఎస్హెచ్ఓలు ఆయా పనులన్నీ తమ సొంత ఖాతాలో వేసుకొని అందుకు సంబంధించిన బిల్లులు పైకి పంపిస్తున్నట్లు పలువురు చర్చించుకుంటున్నారు. సర్కారు నుంచి పైసలు వచ్చినా.. అందులో తమ వాటా కావాలంటూ ఎస్హెచ్ఓలను ప్రశ్నిస్తున్న డీఐలు కూడా ఉన్నారని, ఇరువురి మధ్య అక్కడక్కడ గొడవలు కూడా జరుగుతున్నాయని తెలిసింది. ఈ విషయాలు బయటకు వస్తే తమ ఉద్యోగాలకే ఎసరుపడుతుందని అందరూ గప్‌చుప్‌గా ఉంటున్నారు.
ఇదిలాఉండగా బిల్లులు పెండింగ్‌లో ఉండగానే ఆ ఎస్హెచ్ఓ బదిలీ అయితే.. ఆ బిల్లులు కొత్తగా వచ్చిన ఎస్హెచ్ఓ హయాంలో మంజూరైతే అవి తాను గతంలో ఖర్చుచేసిన బిల్లులని తనకే రావాలంటూ పాతవారు, ‘లేదు నాకు సంబంధం లేదు.. నేను వచ్చిన తరువాత మంజూరయ్యాయి.. అవి మాకే’ అంటూ కొత్తవాళ్లు కూడా గొడవ పడుతున్నట్లు సమాచారం.
అలాగే ఠాణాలకు వచ్చే నిధుల్లో ఏసీపీలు కూడా కొందరు వాటాలు తీసుకుంటున్నట్లు సమాచారం. నెలవారీగా ఠాణాకు ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తే ఎలాంటి సమస్యలుండవని, అలా కాకుండా పెండింగ్‌లో పెట్టడం వల్ల ఎన్నో ఇబ్బందులు ఏర్పడుతున్నాయని పోలీసులు మాట్లాడుకుంటున్నారు. దీనిపై ఉన్నతాధికారులు తగిన చర్యలు తీసుకొని, నిధులు సక్రమంగా విడుదల చేయించాలని, పోలీస్ శాఖలో మొదలైన అవినీతిని మొక్కగా ఉన్నప్పుడు తొలగించాలని, లేదంటే భవిష్యత్‌లో అవినీతి పెరిగి పోలీస్ శాఖకు చెడ్డపేరు వచ్చే అవకాశాలు ఉంటాయని పలువురు హెచ్చరిస్తున్నారు.