సిటీబ్యూరో, ఏప్రిల్ 5 (నమస్తే తెలంగాణ) : దేశవ్యాప్తంగా వివాదాస్పదమైన హెచ్‌సీయూ భూముల్లో సింగపూర్ తరహా ఏకో పార్క్ నిర్మిస్తామంటూ ప్రభుత్వం చెబుతున్న మాటలు హాస్యాస్పదంగా మారాయి. 2వేల ఎకరాల్లో ఏకో టూరిజం పార్క్, నైట్ సఫారీ డెవలప్ చేస్తామంటూ చెబుతోంది. కానీ ఎప్పుడో అందుబాటులోకి రావాల్సిన కొత్వాల్ గూడ ఎకో పార్క్ పెండింగ్ పనులను పూర్తి చేయడంపై దృష్టి పెట్టడం లేదు. సీఎం రేవంత్ రెడ్డి పోర్ట్‌పోలియోలో ఉన్న హెచ్ఎండీఏ పెండింగ్ పనులపై ఇప్పటి వరకు ఒక్కసారి సమీక్షించి, వరల్డ్ టూరిజాన్ని ప్రోత్సహించే కొత్వాల్ గూడ ఎకో పార్క్ పెండింగ్ పనులను మాత్రం పూర్తి చేస్తామని ప్రకటించకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
స్వయంగా ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న మున్సిపల్ శాఖ ఆధీనంలో ఉన్న హెచ్ఎండీఏలో 90శాతం పనులు పూర్తయిన కొత్వాల్ గూడ ఎకో పార్క్‌ను ఇప్పటికీ పూర్తి చేయడం లేదు కానీ… కొత్తగా వివాదాస్పదమైన హెచ్‌సీయూలోని 2వేల ఎకరాల భూముల్లో ఎకో టూరిజం పార్క్ నిర్మిస్తామని ఊరిస్తోంది. కేవలం పెండింగ్ పనులను పూర్తి చేస్తే నగరవాసులకు వరల్డ్ క్లాస్ టూరిజం పార్క్ అందుబాటులోకి వస్తుందని తెలిసినా… ఆ పనులను పూర్తి చేయడంపై దృష్టి పెట్టడం లేదు.
ఏడాదిన్నర కాలంగా కొత్వాల్‌గూడ ఎకో పార్క్ అభివృద్ధి పనులన్నీ అటకెక్కాయి. దాదాపు 125 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్న ఈ పార్కులో గత ప్రభుత్వం 75 శాతానికి పైగా పనులు చేపట్టింది. దాదాపు 25శాతం పనులు పెండింగ్‌లో ఉండగా… ఎన్నికల కారణంగా నిలిచిపోయాయి. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ఏడాదిన్నర కావస్తున్నా.. ప్రాజెక్టుల పురోగతిపై ప్రభుత్వం కనీసం ఒక్క సమీక్ష కూడా చేయలేదు. ఓపెన్ ఎయిర్ థియేటర్, ఎంట్రెన్స్ ఆర్చ్, ఓపెన్ ప్లాజా, అప్రోచ్ రోడ్డు, ల్యాండ్ స్కేపింగ్, గ్రీనరీ వంటి సదుపాయాలతో అధునాతన టూరిజం వేదికగా కొత్వాల్ గూడ మార్చేలా 2022లో కేసీఆర్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ప్రారంభించింది.
ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేయడంలో కాంగ్రెస్ సర్కారు చేస్తున్న నిర్లక్ష్యంతో… ఎప్పుడో అందుబాటులోకి రావాల్సిన కొత్వాల్‌గూడ ఎకో పార్క్ మోక్షం రావడంలేదు. మహానగర జంట జలాశయాలకు సమీపంలో ఉన్న ఎకో టూరిజం పార్క్‌ను త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని నగరవాసులు కోరుతున్నారు. కానీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును నిర్లక్ష్యం చేస్తూ… వివాదాస్పదమైన హెచ్‌సీయూ భూముల్లో ఎకో టూరిజం పార్క్‌ను అభివృద్ధి చేస్తామని ప్రకటించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.