-సిటీబ్యూరో, జూలై 14 (నమస్తే తెలంగాణ): : మాన్సూన్ ప్రారంభ ముగింట నాలా పూడికతీత, మాన్సూన్ ఎమర్జెన్సీ పనులు తీసుకున్న హైడ్రా పనితీరు పట్ల కార్పొరేటర్లు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. మునుపెన్నడూ లేనివిధంగా ఈసారి వానాకాలం ఎమర్జెన్సీ బాధ్యతలను భుజానే వేసుకున్న హైడ్రా ఇప్పటికే 4,100 మంది సిబ్బందితో 2 రకాల మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్‌లను సిద్ధం చేసింది. వర్షం ఎప్పుడు వస్తుందో ఎంత మొత్తంలో పడుతుందో అంచనా వేయలేని పరిస్థితుల్లో మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్ (ఎంఈటీ)లు 24 గంటలూ అప్రమత్తంగా ఉండాలని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ సూచించారు.
పోలీస్, జలమండలి, విద్యుత్, జీహెచ్ఎంసీ శాఖలతో సమన్వయ సమావేశాలు కూడా నిర్వహించింది. ఈ క్రమంలో సహాయక చర్యలు, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాల్సిన బాధ్యత హైడ్రాపై ప్రధానంగా ఉంది. నాలాలను, కల్వర్టులను పరిశీలించి వరద నీటి ప్రవాహం సాఫీగా సాగేలా జాగ్రత్త చర్యలు చేపట్టడం, ఎక్కడ నీరు నిలుస్తుందో ముందుగానే ఒక అంచనాకు వచ్చి ..సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. చెట్లు పడిపోతే వెంటనే వాటిని తొలగించాలి.
ఐతే గడిచిన కొన్ని రోజులుగా కురుస్తున్న అడపదడపా వర్షాలతో హైడ్రాకు సంబంధించిన క్షేత్రస్థాయిలోని ఎంఈటీ, ఎస్ఎఫ్వోలతో స్థానిక డివిజన్ కార్పొరేటర్ల మధ్య సమన్వయం లోపం ఉంటుండటం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇందులో భాగంగానే సోమవారం ప్రజావాణి వేదికగా బీజేపీ కార్పొరేటర్ శ్రవణ్ వినూత్న రీతిలో నిరసన తెలిపారు. హైడ్రాతో జీహెచ్ఎంసీ దోస్తికి నిరసనగా కమిషనర్.. కుర్చీ వద్ద కొబ్బరికాయ నైవేద్యంతో నిరసన తెలిపారు. జీహెచ్ఎంసీ అధికారాలను హైడ్రాకు బదిలీ చేస్తూ జీహెచ్ఎంసీని మొద్దు నిద్రలోకి నెట్టేసిందని శ్రవణ్ ఆరోపించారు. గతంలో ఎమర్జెన్సీ బృందాలు ఏఈల వద్ద ఉండేవని, వారితో కో ఆర్డినేషన్‌తో సమస్యకు సత్వర పరిష్కారం దొరికేదని చెప్పారు.
ప్రస్తుతం జీహెచ్ఎంసీ ఏమి చేస్తున్నదో? హైడ్రా ఎక్కడ ఉందో కార్పొరేటర్లకు తెలియని పరిస్థితి నెలకొందన్నారు. క్షేత్రస్థాయిలో మాన్సూన్ టీం ఎక్కడ ఉంటుంది? వారిని మేం ఎలా సంప్రదించాలి? వాస్తవ పరిస్థితులు తెలిసిన మాతో హైడ్రా సిబ్బంది లేకపోవడంతో సమస్య తీవ్రరూపం దాల్చుతుందంటూ పలువురు కార్పొరేటర్లు జీహెచ్ఎంసీ ఇంజనీర్ల వద్ద వాపోతున్నారు. ఇదే విషయాన్ని ప్రధాన కార్యాలయంలోని ఓ ముఖ్య ఇంజనీర్ సైతం సమన్వయం లోపం ఉంటుందని ప్రజావాణిలో చెప్పడం గమనార్హం.