హైదరాబాద్, నవంబర్ 26 (నమస్తేతెలంగాణ): ప్రజాసమస్యలపై నిలదీస్తున్నందుకే మేయర్ తమపై కక్ష సాధిస్తున్నారని బీఆర్ఎస్ కార్పొరేటర్ దేదీప్యరావు ధ్వజమెత్తారు. ‘మా పార్టీ నుంచి గెలిచి మా మద్దతుతో గద్దెనెక్కి మమ్మల్నే తొక్కేందుకు యత్నిస్తున్నారు..’అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ఆమెకు మేయర్ పదవిలో కొనసాగే హక్కులేదని, వెంటనే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రవర్తన మార్చుకోకుంటే విదేశాల నుంచి వచ్చిన మేయర్ తిరిగి అక్కడికే వెళ్లిపోవాల్సి వస్తుంది..నోరు అదుపులో పెట్టుకోకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.
తాము మేయర్లా అవకాశవాదులం కాదని, నికాైర్సెన గులాబీ సైనికులమని స్పష్టంచేశారు. ప్రజలు ఓట్లేసి గెలిపించిన పార్టీ తరుఫున పనిచేస్తామని, నమ్ముకున్నవారి కోసం అహర్నిశలు పనిచేస్తామని తేల్చిచెప్పారు. బుధవారం తెలంగాణ భవన్లో కార్పొరేటర్ రాసూరి సునీతతో కలిసి వారు విలేకరులతో మాట్లాడారు. మొన్న జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో దళిత కార్పొరేటర్‌పై మేయర్ వ్యహరించిన తీరు, చూపిన పక్షపాతాన్ని మీడియా ఎదుట ఎండగట్టారు. మిగతా కారు గుర్తుపై గెలిచిన మేయర్ కన్నతల్లి లాంటి పార్టీకి ద్రోహం చేశారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పార్టీ ఫిరాయించిన ఆమె కౌన్సిల్ మీటింగ్‌లో నియంతలా తమ గొంతునొక్కడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రేటర్ భూములను కాపాడాలని అడిగితే దాడులకు దిగేందుకు యత్నించడం బాధాకరమన్నారు.
సబ్జెక్ట్ లేకుండా మాట్లాడే మేయర్ తమకు సబ్జెక్ట్ లేదని మాట్లాడడం శోచనీయమన్నారు. అధికారపార్టీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ప్రజాసమస్యల పరిష్కారానికి చొరవ చూపాలన్నారు. రోడ్లపై గుంతలు పూడ్చేందుకు, మంచినీళ్లు సరఫరా, కొత్త రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.
మేయర్ ఉద్ధేశ్యపూర్వకంగానే బీఆర్ఎస్ కార్పొరేటర్లను బద్నాం చేస్తున్నారని కార్పొరేటర్ రాసూరి సునీత ఆరోపించారు. జూబ్లీహిల్స్ ఎన్నికల వేళ తాము పార్టీ మారామని.. ఆమెపై చేసిన ఆరోపణలను మనసులో పెట్టుకొనే పగ సాధిస్తున్నారని విమర్శించారు. ఆమె ఎన్ని ఇబ్బందులు పెట్టినా ప్రజాసమస్యలపై పోరాడుతూనే ఉంటామని తేల్చిచెప్పారు. ఇప్పటికైనా మేయర్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్పై కక్ష సాధించడం మాని అభివృద్ధిపై దృష్టిపెట్టాలని డిమాండ్ చేశారు. లేదంటే వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బుద్ధిచెప్పేందుకు నగర ప్రజలు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు.
సీఎం రేవంత్‌రెడ్డి డైరెక్షన్లో వెళ్తున్న మేయర్ తమను కించపరుస్తున్నారని కార్పొరేటర్ మన్నె కవిత ఆరోపించారు. బీసీ మేయర్‌ను అవమానిస్తున్నారని మాట్లాడడం ఆక్షేపణీయమన్నారు. బీసీ బిల్లుకు తాము సంపూర్ణ మద్దతు ఇచ్చామని గుర్తుచేశారు. నాపై ఆరోపణలు చేస్తే మౌనంగా ఉంటానని అనుకోవద్దు.. మహంకాళిలా దీటుగా సమాధానమిస్తానని తేల్చిచెప్పారు. ‘వెనుకడుగు వేసే ప్రసక్తేలేదు..ఒకటికి వెయ్యి రెట్లు..లక్షకు కోటి రెట్లు..మాటకు మాట..సమాధానం చెప్పి నేనేంటో చూపిస్తా’ అంటూ హెచ్చరించారు.