మేడ్చల్, అక్టోబర్10 (నమస్తే తెలంగాణ): అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చేసిన నయవంచనపై అవగాహన కల్పించేందుకు.. బీఆర్ఎస్ పార్టీ తీసుకువచ్చిన ‘కాంగ్రెస్ బాకీ కార్డు ఉద్యమం’ మేడ్చల్ జిల్లాలో ముమ్మరంగా సాగుతోంది. స్థానిక బీఆర్ఎస్ నేతలు.. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని ఐదు నియోజకవర్గాలలో ఇంటింటికి తిరిగి కాంగ్రెస్ బాకీ కార్డులను పంపిణీ చేస్తున్నారు.
మేడ్చల్, ఉప్పల్, మల్కాజిగిరి, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాలకు గాను ఇప్పటికే మేడ్చల్, ఉప్పల్ నియోజకవర్గంలో బాకీ కార్డుల పంపిణీ ప్రారంభం కాగా మరో రెండు రోజులలో మల్కాజిగిరి, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి నియోజకవర్గంలో ప్రారంభించనున్నారు. కాంగ్రెస్ బాకీ కార్డుల పంపిణీపై ఎమ్మెల్యేలు చామకూర మల్లారెడ్డి, మాధవరం కృష్ణారావు, మర్రి రాజశేఖర్రెడ్డి, కేపీ. వివేకానంద్, బండారు లక్ష్మారెడ్డి.. బీఆర్ఎస్ శ్రేణులు, నాయకులకు దిశా నిర్దేశం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన 420 హామీలను పూర్తిగా విస్మరించిందని స్థానిక నాయకులు ప్రజలకు వివరిస్తున్నారు.
ఇచ్చిన హామీలను నేరవేర్చేవరు కాంగ్రెస్ నాయకులను నిలదీయాలని బీఆర్ఎస్ శ్రేణులు ప్రజలను కోరుతున్నారు. బాకీ కార్డులో మహిళలకు నెలకు రూ.2500 హామీ మేరకు 22 నెలకు రూ.55వేల బాకీ, వృద్దులకు పెన్షన్ నెలకు రూ.4000 హామీ 22 నెలలకు రూ.44 వేల బాకీ, వికలాంగుల పెన్షన్ నెలకు రూ.6000 హామీ రూ.44 వేల బాకీ, షాదీ ముబారక్, కల్యాణలక్ష్మి ఆడబిడ్డల పెళ్లిళ్లకు తులం బంగారం బాకీ, రైతు భరోసా 4 ఎకరాలకు రూ.76,000 బాకీ, రుణమాఫీ రూ.2లక్షల బాకీ, నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు బాకీ, విద్యా భరోసా కార్డు విద్యార్థులకు రూ.5లక్షల బాకీ పేరిట.. కార్డుల పంపిణీ జరుగుతుంది. నియోజకవర్గంలోని ప్రజలందరకీ కాంగ్రెస్ బాకీ కార్డులను పం పిణీ చేస్తామని బీఆర్ఎస్ నేతలు తెలిపారు.