జవహర్‌నగర్, డిసెంబర్ 15: ఫోన్ విషయంలో అన్నదమ్ముళ్లు గొడవపడ్డారు.. వద్దని తండ్రి మందలించడంతో మనస్థాపం చెందిన కుమారుడు యాసిడ్ తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధి జమ్మిగడ్డలో చోటుచేసుకున్నది. ఎస్‌హెచ్‌వో సైదయ్య తెలిపిన ప్రకారం.. జమ్మిగడ్డలోని బీజేనగర్ కాలనీలో వెంకటేశ్, భార్య, ముగ్గురు కుమారులైన సాయికుమార్, సాయికృష్ణ, రాకేశ్‌తో కలిసి నివస్తున్నారు. ఈనెల 14వ తేదీన ఫోన్ విషయంలో కుమారులు గొడవపడుతుండటంతో వద్దని తండ్రి వారించాడు. ఈ క్రమంలో పెద్దవాడు అయిన సాయికృష్ణను ఏదో ఒక పని చేసుకుని బతకాలని చెప్పడంతో మనస్థాపం చెందిన సాయికృష్ణ(18) రాత్రి 9గంటల సమయంలో యాసిడ్‌ని తాగాడు. దీంతో కుటుంబ సభ్యులు గుర్తించి సాయికృష్ణను సమీపంలోని ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించారు. మెరుగైన వైద్యం కోసం గాంధీ దవాఖానకు తరలించాలని వైద్యులు సూచించడంతో అక్కడికి తీసుకెళ్లగా.. చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.