దుండిగల్, డిసెంబర్ 22 : కుటుంబ కలహాలు, భూతగాదాల నేపథ్యంలో పరిష్కరించుకుందామని స్నేహితుడితో పిలిపించి.. మద్యం తాగి సొంత తమ్ముడిని అన్న హత్య చేశాడు. ఈ సంఘటన దుండిగల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని బహదూర్‌పల్లి సాయినాథ్ సొసైటీలో శనివారం అర్ధరాత్రి చోటు చేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం, రాయలాపూర్ గ్రామానికి చెందిన మాదాసు సంతోశ్(33), సందీప్(30) అన్నదమ్ములు. సంతోశ్ కొంతకాలంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని చింతల్లో భార్య, పిల్లలతో కలిసి నివాసం ఉంటుండగా, సందీప్ తన సొంత గ్రామంలోనే భార్యాపిల్లలతో కలిసి ఉంటున్నాడు. వీరిద్దరి మధ్య గత కొంతకాలంగా భూతగాదాలతోపాటు కుటుంబ కలహాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో తమకు సమీప బంధువు, రాయలాపూర్ గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్ మన్నె శేఖర్ ద్వారా భూతగాదాలను పరిష్కరించుకుందామంటూ తన తమ్ముడిని తీసుకురావాలని సంతోశ్ కోరాడు. దీంతో శనివారం సాయంత్రం శేఖర్.. తన ఆటోలో సందీప్‌ను తీసుకొచ్చాడు.
దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని బహదూర్‌పల్లి సాయినాథ్ సొసైటీలో రోడ్ నంబర్ 4 వద్దకు తీసుకొచ్చాడు. అనంతరం ముగ్గురు కలిసి రాత్రి పొద్దుపోయేంత వరకు మద్యం సేవించారు. అనంతరం ఆస్తి వివాదాలకు సంబంధించిన విషయాన్ని చర్చిస్తుండగా రాత్రి 11 గంటల సమయంలో సంతోశ్.. తన బైక్‌లో దాచుకున్న సుత్తెను తీసుకొని తమ్ముడు సందీప్ తలపై విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రగాయాలపాలైన సందీప్ అక్కడికక్కడే మృతి చెందాడు. వెంటనే సంతోశ్.. బైక్‌పై అక్కడి నుంచి పరారయ్యాడు. ఇదే విషయాన్ని అక్కడే ఉన్న మన్నె శేఖర్.. సందీప్,సంతోశ్ల సమీప బంధువు డి.పోచంపల్లిలో నివాసం ఉంటున్న ఆశా లింగంగౌడ్కు ఫోన్‌ద్వారా తెలిపాడు. దీంతో లింగంగౌడ్తోపాటు మరో వ్యక్తి బెండి వీరేశ్తోకలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే సందీప్ మృతి చెందినట్లు నిర్థారించుకున్న లింగంగౌడ్ దుండిగల్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఈ మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.