చాదర్‌ఘాట్, మే 8: ఆస్తి కోసం తమ్ముడి గొంతు కోసి హత్య చేసిన అన్నను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. చాదర్‌ఘాట్ ఇన్స్పెక్టర్ సూర్యప్రకాశ్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. అంబర్‌పేట ప్రేంనగర్కు చెందిన అశోక్ తన మొదటి భార్య సుమతి 1998లో మృతి చెందడంతో మరో వివాహం చేసుకున్నాడు. మొదటి భార్య సుమతికి ఒక కుమారుడు మల్లేశ్(34), ముగ్గురు కుమార్తెలు కాగా.. రెండవ భార్య బాలమణికి ఒక కుమారుడు నవీన్ ఉన్నాడు. మల్లేశ్ 2017లో వివాహం చేసుకొని ఉప్పల్‌లో నివాసముంటూ రామంతాపూర్‌లో టిఫిన్ సెంటర్ నడుపుతూ అప్పులపాలయ్యాడు. తిరిగి అంబర్‌పేటలోని తన తండ్రి నివాసానికి వచ్చి పైఅంతస్తులో నివాసముంటున్నాడు. కింది అంతస్తులో రెండవ భార్య బాలమణి కుమారుడు తన తల్లితండ్రులతో కలిసి ఉంటున్నాడు.
ఇంటి విక్రయంలో గొడవ
అప్పుల బాధలు అధికం కావడంతో మల్లేశ్ అంబర్‌పేట ప్రేంనగర్లోని ఇంటిని విక్రయించాలని తండ్రి అశోక్‌పై ఒత్తిడి తెచ్చాడు. అందుకు తండ్రి నిరాకరించడంతో పాటు మల్లేశ్ సోదరి ఉషారాణి తనకు ఇంటిలో వాటా వస్తుందని కోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. చేసేది లేక అశోక్ ఇంటిని అమ్మకానికి పెట్టాడు. ఇంటిని విక్రయించగా వచ్చిన డబ్బులో రూ.50లక్షలు తన వద్దే పెట్టుకొని మిగిలిన డబ్బులు ఇస్తానని మల్లేశ్‌కు చెప్పాడు. కానీ, ఇందుకు మల్లేశ్ అంగీకరించలేదు. ఇదే విషయమై తండ్రితో మాట్లాడి పరిష్కరించుకుందామని, గత శనివారం మధ్యాహ్నం లంచ్ బాక్స్ తీసుకొని మల్లేశ్, నవీన్ మలక్‌పేట ఎంసీహెచ్ కాలనీలోని పిండిగిర్నికి వెళ్లారు. నవీన్ ద్విచక్ర వాహనం నడుపుతుండగా, మల్లేశ్ బైక్ వెనుక కూర్చున్నాడు. మలక్‌పేట మహబూబ్ మన్షన్లోని సుబ్బయ్య గారి హోటల్ వెనుకకు చేరుకోగానే మల్లేశ్ తన వెంట తీసుకొచ్చిన పేపర్ కటింగ్ బ్లేడ్‌తో నవీన్ గొంతు కోసి అక్కడినుంచి పరారయ్యాడు. దర్యాప్తులో భాగంగా నిందితుడు మల్లేశ్‌ను సోమవారం గోల్నాక బ్రిడ్జి వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారించగా నేరాన్ని అంగీకరించడంతో రిమాండ్‌కు తరలించారు.