BRAOU | బంజారాహిల్స్, మార్చి 4 : 75 శాతం మంది విద్యార్థులకు అపార్ ఐడీని తయారుచేసి ఇవ్వడం ద్వారా డా. బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించడంతో పాటు తెలంగాణలోని ఇతర యూనివర్సిటీలకు మార్గదర్శిగా నిలిచిందని ఉన్నత విద్యామండలి కార్యదర్శి శ్రీరాం వెంకటేష్ అన్నారు. అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ సెంటర్ ఫర్ స్టాఫ్ ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్(సీఎస్టీడీ) , తెలంగాణ ఉన్నత విద్యామండలి సంయుక్త ఆధ్వర్యంలో ‘అంబేద్కర్ వర్సిటీలో అపార్ అమలు’ అనే అంశంపై రెండు రోజుల పాటు నిర్వహించిన శిక్షణా కార్యక్రమం మంగళవారం ముగిసింది.
ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీరాం వెంకటేష్ మాట్లాడుతూ.. ఆటోమేటెడ్ పర్మినెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ( అపార్)లో నమోదు చేసుకోవడం ద్వారా ప్రతి విద్యార్థికి సంబంధించిన సమగ్రమైన సమాచారం అందుబాటులోకి వస్తుందన్నారు. విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత ఉద్యోగాల కోసం వెళ్లినప్పుడు సైతం సర్టిఫికెట్ల పరిశీలన సులభంగా పూర్తవుతుందన్నారు. రానున్న రోజుల్లో అన్ని యూనివర్సిటీల్లో అపార్ ఐడీలను రూపొందిచేందుకు ఉన్నత విద్యామండలి ఆండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. త్వరలోనే అన్ని ప్రైవేటు విద్యాసంస్థలకు కూడా అపార్ ఐడీ నమోదుపై శిక్షణా కార్యక్రమాలు అందిస్తామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో అంబేద్కర్ వర్సిటీ వైస్ చాన్స్లర్ ప్రొ.ఘంటా చక్రపాణి. సీఎస్టీడీ డైరెక్టర్ డా. పరాంకుశం వెంకటరమణ, డిజిటల్ ఇండియా కార్ఫొరేషన్ అధికారులు రోహిత్ సింగ్, రోహిత్ కశ్యప్, రవి పాండే తదితరులు పాల్గొన్నారు.