సిటీబ్యూరో, జూన్ 25 (నమస్తే తెలంగాణ ): జీహెచ్ఎంసీలో అంతర్గత బదిలీలకు బ్రేక్‌లు పడ్డాయా? జాబితా సిద్ధమైన ఇప్పట్లో ట్రాన్స్ఫర్స్ ఉండవా? కమిషనర్ మార్పుతో మరిన్ని నెలలు బదిలీల జోలికి వెళ్లరా? అంటే ఉద్యోగ వర్గాల నుంచి అవుననే సమాధానం వస్తున్నది. ఒకే చోట మూడేళ్లకు పైబడి జూనియర్ అసిస్టెంట్ మొదలు, అదనపు కమిషనర్ల వరకు అన్ని విభాగాలకు సంబంధించి పెద్ద ఎత్తున బదిలీలు జరిపేందుకు సిద్ధమైంది. జీహెచ్ఎంసీ కమిషనర్‌గా ఉన్న రొనాల్డ్‌రాస్ శాఖల వారీగా నివేదికలు తెప్పించుకున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో 2500 నుంచి 3వేల మంది ఉద్యోగులను బదిలీ చేయాలని నిర్ణయించారు. కమిషనర్ రొనాల్డ్‌రాస్ సెలవు నుంచి రాగానే బదిలీల ప్రక్రియ ఉంటుందని అందరూ భావించారు. కానీ రొనాల్డ్‌రాస్ స్థానంలో ఆమ్రపాలిని కమిషనర్‌గా నియమిస్తూ రెండు రోజుల క్రితం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కమిషనర్ మార్పుతో ఒక్కసారిగా బదిలీల అంశం పక్కదారి పోయే అవకాశాలు కనబడుతున్నాయన్న చర్చ ఉద్యోగుల్లో మొదలైంది. అసలే వర్షాకాలం, నూతన కమిషనర్‌గా శాఖపై పూర్తి స్థాయి పట్టు వచ్చే వరకు బదిలీల అంశానికి వెళ్లేందుకు ఆసక్తి కనబర్చరన్న వాదనలు వినిపిస్తున్నాయి.
మొత్తంగా జీహెచ్ఎంసీలో అవినీతి, ఆరోపణలు, సుదీర్ఘకాలం తిష్ట వేసిన ఉద్యోగులకు కమిషనర్ మార్పు కలిసొచ్చాయంటున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం పర్మినెంట్, ఔట్ సోర్సింగ్ లేదా కాంట్రాక్ట్ సిబ్బంది మొత్తం కలిపి 26 నుంచి 28వేల మంది ఉంటారు. 18,500 శానిటేషన్ వర్కర్లు, 950 సూపర్ వైజర్లు, 500 నుంచి 800 మంది ఆపరేటర్లు, 500 మంది జూనియర్, సీనియర్ అసిస్టెంట్లు, 400 మంది సూపరింటెండెంట్లు , సుమారు 100 మంది అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్లు, 20 మంది జాయింట్ కమిషనర్లు, 20 మంది మెడికల్ ఆఫీసర్లు, 30 మంది డిప్యూటీ కమిషనర్లు ఉన్నారు. అయితే ఎక్కువగా బదిలీల్లో మూడేళ్లకు పైబడి ఒకే చోట కొనసాగుతుండటం, అవినీతి, ఆరోపణలు, వివాదాస్పద అధికారులకు స్థానం చలనం ఉంటుందని భావించారు. ఇంజినీరింగ్, డిప్యూటీ కమిషనర్లు, టౌన్‌ప్లానింగ్ విభాగానికి సంబంధించి జీహెచ్ఎంసీ నుంచి ఇతర మున్సిపాలిటీలకు, అక్కడి నుంచి జీహెచ్ఎంసీకి మార్పులు, చేర్పులు జరుగుతాయని అధికారుల్లో చర్చ జరుగుతున్న తరుణంలో ఒక్కసారిగా వీటికి మరింత కాలం బ్రేక్ పడినైట్లెంది.