హైదరాబాద్, జనవరి 30 : కేంద్రంలో నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం ప్రశ్నించే యువ గొంతులను అణిచివేసే ప్రమాదకర ధోరణిని అవలంబిస్తోందని తెలంగాణ ప్రదేశ్ మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు డా. రేఖ బోయలపల్లి (Boyalapalli Rekha) తీవ్రంగా విమర్శించారు. “నేటి భారతదేశంలో ప్రశ్నించడం నేరంగా మారుతోంది. మోడీ ప్రభుత్వ వైఫల్యాలు మాత్రం కప్పి ఉంచబడుతున్నాయి” అని ఆమె వ్యాఖ్యానించారు.
ఉత్తరప్రదేశ్ లక్నోకు చెందిన 14 ఏళ్ల యువ కార్యకర్త అశ్వమిత్ గౌతమ్ (Ashwamit Gautam)పై కొనసాగుతున్న వేధింపులను ఖండించిన డా. రేఖ.. ఆ యువకుడు ఎవరిని దుర్భాషలాడలేదని, హింసకు పాల్పడేలా రెచ్చగొట్టలేదని తెలిపారు. కేవలం నిజాలను వెలుగులోకి తెచ్చాడని, ఆధారాలతో ప్రశ్నించాడని ఆమె స్పష్టం చేశారు. ఆ యువకుడిపై వేధింపులను ఖండించిన బోయలపల్లి రేఖ అతడేమి తప్పు చేశాడని కేంద్రాన్ని నిలదీశారు.
“ధరల పెరుగుదలపై డేటాతో, నిరుద్యోగంపై గణాంకాలతో, కాలుష్యంపై అధికారిక నివేదికలతో, చదువు వాణిజ్యీకరణపై పాలసీ డాక్యుమెంట్లతో, హాస్పిటల్స్, రోడ్ల దుస్థితిపై ప్రభుత్వ బడ్జెట్ గణాంకాలతో అశ్వమిత్ ప్రభుత్వాన్ని నిలదీసినందుకే వ్యవస్థ వణికిపోయింది. ఆ కుర్రాడిపై బెదిరింపులకు దిగింది” అని బోయలపల్లి రేఖ వెల్లడించారు. ప్రశ్నించే వారిని అణచివేయానుకుంటున్న ప్రభుత్వ వైఖరిపై డా. రేఖ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
లగ్జరీ కార్లలో తిరుగుతూ, కేంద్ర మంత్రుల చేతుల మీదుగా అవార్డులు పొందుతున్న 10 ఏళ్ల ప్రవచనకారుడు ప్రశంసలు పొందుతుంటే.. ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు ఓ టీనేజర్పై మాత్రం కేసులు పెడుతూ, బెదిరింపులకు దిగుతున్నారని రేఖ మండిపడ్డారు. “ఇది కేంద్ర ప్రభుత్వం ప్రమాదకరమైన మనస్తత్వాన్ని బయటపెడుతోంది, అంధ విధేయతకు బహుమతి, విమర్శనాత్మక ఆలోచనకు శిక్ష” అని ఆమె వ్యాఖ్యానించారు. శాస్త్రం స్థానంలో మూఢనమ్మకాలు, పండితుల స్థానంలో బాబాలు ప్రాచుర్యంలోకి వస్తే ‘నేషన్ బిల్డింగ్’ నుంచి ‘మాస్ కండీషనింగ్’ వైపు మోడీ పాలన దిగజారుతుందని ఆమె హెచ్చరించారు.
“ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రశ్నలపై, చర్చలపై, బాధ్యతపై నిలబడుతుంది తప్ప భయం, బలవంతం చేయడంపై మాత్రం కాదు” అని స్పష్టం చేశారు. “ప్రశ్నించే పిల్లాడు దేశానికి ప్రమాదం కాదు. మౌనంగా ఉండే సమాజమే అసలైన ప్రమాదం. బ్రిటిష్ పాలకులను తరిమేసింది నియంతృత్వాన్ని అంగీకరించేందుకు కాదు” అని ఆమె మోడీ ప్రభుత్వానికి గట్టి హెచ్చరిక చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని సూటిగా ప్రశ్నిస్తూ “ప్రజల ప్రశ్నలకు సమాధానం చెబుతారా? లేదా ప్రశ్నించిన వారినే జైలులో పెడతారా?” అని డా. రేఖ బోయలపల్లి నిలదీశారు.