బంజారాహిల్స్,ఆగస్టు 4 :13ఏళ్ల బాలుడు కారు నడుపుతూ సైకిల్ మీద వెళ్తున్న వృద్ధుడిని ఢీకొట్టిన ఘటన బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మల్లేపల్లి సమీపంలోని మాంగార్బస్తీలో నివాసం ఉండే ఎండీ.షమీమ్(70) సైకిల్ మీద కూరగాయలు అమ్ముకుంటూ జీవిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఉదయం ఇంటినుంచి బయలుదేరి మాసాబ్‌ట్యాంక్ మీదుగా బంజారాహిల్స్ రోడ్ నెం 1లో వెళ్తున్నాడు.
బంజారాహిల్స్ రోడ్ నెం 11లోని సర్వీ హోటల్‌కు సమీపంలోకి రాగానే వెనకనుంచి వచ్చిన ఓ స్విఫ్ట్ కారు (టీజీ08సీ6385) అతడిని ఢీకొట్టింది. ఈ ఘటనలో కిందపడిపోయిన షమీమ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం సమయంలో కారును 13ఏళ్ల బాలుడు నడిపిస్తున్నట్లు గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ మేరకు బాధితుడి ఫిర్యాదుతో బాలుడితో పాటు అతడికి కారు ఇచ్చిన వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.