దుండిగల్, జూన్ 28: రెప్పపాటు సమయంలో కన్నతల్లి ఎదుటే జరిగిన ప్రమాదంలో బాలుడు దుర్మరణం చెందాడు. ఈ హృదయ విదారక ఘటన దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. నిజామాబాద్‌కు చెందిన రాజురెడ్డి , నిహారిక దంపతులు. వీరికి కొడుకు అభిమన్షురెడ్డి (6), కూతురు ఉన్నారు. రాజు దుండిగల్ మున్సిపాలిటీ మల్లంపేట్‌లోని ఆకాశ్ లే అవుట్లో నివాసముంటూ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. నిహారిక గృహిణి కాగా అభిమన్షురెడ్డి బౌరంపేటలోని గీతాంజలి స్కూల్లో ఒకటో తరగతి చదువుతున్నాడు. అయితే అభిమన్షురెడ్డిని శుక్రవారం ఉదయం ఎనిమిది గంటలకు స్కూల్లో దింపేందుకు స్కూటీపై నిహారిక బయలు దేరింది.
పల్లవి స్కూల్ వద్దకు రాగానే వెనుక నుంచి కంకర లోడుతో వచ్చిన టిప్పర్ (టీఎస్ 15 యు ఎఫ్ 4599) స్కూటీని ఢీ కొట్టింది. ఈ దుర్ఘటనలో అభిమన్షురెడ్డి కింద పడగా బాలుడిపై నుంచి వెళ్లిపోయింది. దీంతో తల నుజ్జునుజ్జు కాగా రెప్పపాటు సమయంలోనే దుర్మరణం చెందాడు. కన్నుమూసి తెరిచేలోగా తన కొడుకు కానరాని లోకాలకు వెళ్లడంతో తల్లి రోదనకు అంతులేకుండా పోయింది. ఈ దృశ్యం చూసిన వాళ్లు సైతం కంటనీరు పెట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీకి తరలించారు. అయితే టిప్పర్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నట్లు సమాచారం. ఈ ప్రమాదంలో నిహారిక సైతం గాయపడగా ఓ ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు.
రోడ్డు ప్రమాదంలో చిన్నారి అభిమన్షు రెడ్డి మరణ వార్త తెలుసుకున్న స్థానికులు కొద్దిసేపు అక్కడ ఆందోళన చేపట్టారు. రోడ్డు ఇరుకుగా ఉండటంతో ప్రమాదాలు జరుగుతున్నాయని.. విస్తరణ చేయాలని డిమాండ్ చేశారు. పల్లవి స్కూల్ వద్ద ప్రమాదం జరగడం రెండోసారని వివరించారు. స్కూల్ బస్సులను సైతం రోడ్లపై నిలపకుండా చూడాలని కోరారు.