Dundigal | హైదరాబాద్ : నిర్మాణంలో ఉన్న ఓ భవనం గేటు ప్రమాదవశాత్తు మీద పడడంతో ఓ బాలుడు మృతి చెందాడు. ఈ విషాద ఘటన దుండిగల్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం కుకునూరు గ్రామానికి చెందిన డి నవీన్, మీనా దంపతులు ఉపాధి నిమిత్తం పదేండ్ల క్రితం నగరానికి వలస వచ్చారు. ప్రస్తుతం బౌరంపేటలో నివాసం ఉంటున్నారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు కాగా, పెద్ద కుమారుడు ఆకాశ్(7) స్థానికంగా ఓ ప్రయివేటు స్కూల్లో ఒకటో తరగతి చదువుతున్నాడు.
బౌరంపేటలోనే ఆకాశ్ తాత, నానమ్మలు సెక్యూరిటీగార్డులుగా పని చేస్తున్నారు. ఈ క్రమంలో గురువారం ఉదయం వారి వద్దకు తమ్ముడితో కలిసి ఆకాశ్ వచ్చాడు. ఆ భవనం ముందు ఆడుకుంటుండగా.. ప్రమాదవశాత్తు ఇనుప గేటు మీదపడి ఆకాశ్ ప్రాణాలు కోల్పోయాడు. గేటును అమర్చకుండా, పక్కకు నిలబెట్టడంతోనే ప్రమాదం జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆకాశ్ తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.