బండ్లగూడ, సెప్టెంబర్ 16: ఓ చిన్న నిర్లక్ష్యం నిండు ప్రాణాన్ని బలిగొంది. తండ్రి నడుపుతున్న లారీ చక్రాల కింద నలిగి ఓ బాలుడు మృతి చెందాడు. ఈ ఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. కర్నూల్‌కు చెందిన కృష్ణ బతుకు దెరువు కోసం నగరానికి వచ్చి.. ఇటుకలు తయారు చేసే కంపెనీలో లారీ నడుపుతూ జీవనం కొనసాగిస్తున్నారు. కృష్ణకు ఇద్దరు కూతుళ్లతో పాటు 3 ఏండ్ల విఘ్నేశ్ ఉన్నాడు.
కృష్ణ ఇటుకల లోడ్ తీసుకుని బయటకు వెళ్లే క్రమంలో.. బాలుడు ఏడుస్తుండగా అతడికి చాక్లెట్లు ఇప్పించి ఇంట్లో దిగబెట్టాడు. కృష్ణ యథావిధిగా లారీ వద్దకు వచ్చి లారీని తీసుకుని వెళ్తుండగా.. ఆ బాలుడు లారీ చక్రాల కిందకు వచ్చాడు. గమనించని కృష్ణ లారీని ముందుకు తీయడంతో బాలుడు ఆ లారీ చక్రాల కిందపడి తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలను సేకరించారు. అనంతరం వారు బాలుడి మృతదేహంతో కర్నూల్‌కు వెళ్తున్నట్లు తెలిపారు. కేసును పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.