కుత్బుల్లాపూర్, డిసెంబర్ 31: కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధిలో వీధికుక్కల బెడద రోజురోజుకు మితిమీరిపోతుంది. ఏ కాలనీలో చూసినా వీధికుక్కలు స్వైరవిహారం చేస్తూ స్థానికులపై దాడి చేస్తున్నాయి. దీంతో భయాందోళనకు గురవుతున్నారు. జీడిమెట్ల డివిజన్ పరిధిలోని రాఘవేంద్రకాలనీకి చెందిన లక్ష్మయ్య కుమారుడు అరవింద్(6) మంగళవారం మధ్యాహ్నం సమయంలో గాలిపటం ఎగురవేస్తూ ఇంటి ముందు ఆడుకుంటున్నాడు.
ఈ క్రమంలో అక్కడే ఉన్న వీధికుక్క బాలుడిపై పడి దాడి చేసింది. దీంతో స్థానికులు హుటాహుటిన స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. కాగా కొన్ని రోజుల నుంచి పలు కాలనీల్లో వీధికుక్కలు విచ్చలవిడిగా స్వైరవిహారం చేస్తున్నా.. అధికారులు ఇటు వైపు కన్నెత్తి కూడా చూడకపోవడం పట్ల స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధిలో వీధికుక్కల బెడద నుంచి విముక్తి కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.